Monday, 16 February 2015

'శివపురాణం'లోని లింగోద్భవ కథ

'శివపురాణం'లోని లింగోద్భవ కథ
పరమేశ్వరుడు మంగళ స్వరూపుడు, ఆయన ఆదిదేవుడు, ఆది మధ్యాంత రహితుడు.
అడిగినవారికి, అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు. తాను గరళాన్ని మింగి, లోకాలకు అమృతాన్నిచ్చిన మహోదారుడు శంకరుడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, భక్తులకు సకలైశ్వరముల నిచ్చే భక్తజన సులభుడు పరమశివుడు.అసలు 'శివం' అంటేనే 'మంగళం' లేక ''కల్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు.
శివ - అంటే పరమేశ్వరుడు.
శివా - అంటే పార్వతి. ఇలా అయ్యవారిలోనే అమ్మవారు ఉంది.
'శివపురాణం'లోని లింగోద్భవ కథ అందరికీ తెలిసిందే. శివుడు ప్రథమంగా లింగరూపిగా వెలసిన సందర్భం - హరిబ్రహ్మల వివాద సందర్భంలో రోజు ఒకానొక మాఘమాసంలో కృష్ణ చతుర్దశి రోజు. అర్థరాత్రి వేళ!

బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమ తమ గొప్పదనాలను గురించి వాదులాడుకుంటున్న సమయం. సృష్టిస్థితి, కారకులైన వాపరిద్దరూ అలా వాదులాడుకోవడం, వారిపై ఆవరించియున్న 'మాయ'కు సంకేతం. మాయను తొలగించేందుకు 'మాయి' అయిన మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు. పరస్పర ఆధిక్యతను నిరూపించుకునేందుకు బ్రహ్మాస్త్ర వైష్ణవాస్త్రాలు విజృంభించినప్పుడు, ఇద్దరి నడుమన ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించాడు.

మాఘకృష్ణ చతుర్దశ్యామాది దేవో మహానిశి
శివలింగ తయోద్భూత: కోటి సూర్య సమప్రభ.

కోటి సూర్యలకు సమానమైన ప్రకాశంగల మహాలింగం ఆవిర్భావం జరిగిన రోజే మహాశివరాత్రి. మహాగ్ని స్తంభానికి ఆది, అంతం లేదు. లింగ స్వరూపం నిర్గుణ పరతత్త్వ స్వరూపం.

ఆయన శుభాలనొసగేవాడు. లోక కల్యాణమూర్తి. తనను ప్రార్థించినవారికి కొంగు బంగారం. తనను ఎలా పూజించినా సరే, కేవలం 'భక్తి'కి మాత్రమే ప్రాధాన్యతనిచ్చే అభయంకరుడు శంకరుడు. మహేశ్వరుని విభూది ధరించని నుదురు, ఈశ్వరార్చన చేయని జన్మం, శివాలయ లేని గ్రామం, శివ సంబంధం లేని విద్య, అత్యంత నీచములు, నింద్యములని జాబాలోపనిషత్తు చెబుతోంది. అందుకే సాధారణంగా మన దేసంలో శివాలయం లేని ఊరుండదు. శివాలయం లేని ఊరు స్మశానంతో సమానం.
  వల్లూరి పవన్ కుమార్ 
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ





No comments:

Post a Comment