వరలక్ష్మీ పూజావిధానం
(సులభ
పద్ధతిలో)
శ్రావణమాసంలో వచ్చే ముఖ్యమైన పర్వమిది.
శ్రావణ పూర్ణిమ ముందువచ్చే శుక్రవారం శ్రీ మహాలక్ష్మిని 'వరలక్ష్మి'
పేరుతో అర్చిస్తారు. అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఈ వ్రతం ద్వారా
కలశాన వరలక్ష్మిని ఆవాహనచేసి షోడశోపచారాలతో పూజించడం చేయాలి. కోరిన కోరికలన్నీ తీర్చే
వరలక్ష్మి శ్రావణమాసంలో ఆవిర్భవించింది.
శ్రీమన్నారాయణమూర్తి
శ్రవణం నక్షత్రంలో జన్మించారు. అందుకే శ్రావణ మాసానికి అంత వైశిష్ట్యం. ఈ
నెల రోజులూ ముత్తయిదువులు, పేరంటాలు, మంగళగౌరీ, వరలక్ష్మీ వ్రతాలు, మంగళహారతులతో ఆనందోత్సహాలతో జరుపుకుంటారు. ఎన్నో పండుగల మంగళ
ప్ర సమాహారం శ్రావణం. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం
నాడు వరలక్ష్మీవ్రతం చేసుకుంటారు.
అమ్మవారిని
ఇంటికి ఆహ్వానించి, కాళ్లు కడుక్కోవడానికి నీళ్లిచ్చి, నవరత్న ఖచిత సింహాసనంపై కూర్చుండబెట్టి, తాగడానికి
నీళ్లిచ్చి, స్నానం చేయించి, వస్త్రాలు, ఆభరణాలు అలంకరించి, ధూపదీపనైవేద్యాలతో పూజించి, కథ చెప్పుకుని, శక్తికొద్దీ
నైవేద్యాలు సమర్పించి, సకల మర్యాదలతో సాగనంపినట్లుగా
భావించుకోవాలి. అదే పూజామంత్రాలలోని అంతరార్థం.
ఇక పూజలోకి వద్దాం... ధ్యానం: పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా
భవ మే గేహే సురాసుర
నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయై
నమః ధ్యాయామి (అమ్మవారి కలశం ముందు కొన్ని
పుష్పాలుంచి నమస్కరించాలి)
ఆవాహన:
సర్వమంగళ మాంగల్యే విష్ణు వక్షస్థలాలయే ఆవాహయామి దేవీ త్వాం సుప్రతా
భవ సర్వదా, శ్రీ వరలక్ష్మీ దేవతాయై
నమః ఆవాహయామి’ అని చెబుతూ కలశం
ముందు అక్షతలు వేయాలి.
ఆసనం:
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నవరత్న ఖచిత
సింహాసనం సమర్పయామి. (అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)
అర్ఘ్యం:
శ్రీవరలక్ష్మీ దేవతాయైనమః అర్ఘ్యం సమర్పయామి అంటూ ఉద్ధరిణతో నీటిని
అమ్మవారికి చూపించి ముందున్న అర్ఘ్యపాత్రలో వేయాలి.
పాద్యం:
పాద్యం గృహాణ దేవత్వం సర్వదేవ
నమస్కృతే అంటూ అర్ఘ్యపాత్రలో ఓ
ఉద్ధరిణెడు నీటిని వేయాలి.
ఆచమనం:
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధాచమనీయం సమర్పయామి
(అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
పంచామృతస్నానం:
పయోదధిఘృతో పేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీ
దేవతాయైనమః పంచామృతస్నానం సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)
శుద్ధోదకస్నానం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః శుద్ధోదక స్నానం
సమర్పయామి (తమలపాకుతో కొన్ని చుక్కల నీటిని కలశం మీద చిలకరించాలి)
ఆచమనీయం:
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి (అర్ఘ్యపాత్రలో ఉద్ధరిణెడు నీటిని వేయాలి)
వస్త్రం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి
(అక్షతలు లేదా పుష్పాలు ఉంచాలి)
ఆభరణం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఆభరణాని సమర్పయామి
(పుష్పాలు ఉంచాలి)
ఉపవీతం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి
(పత్తితో చేసిన సూత్రం చివరలో
గంధం రాసి కలశానికి అంటించాలి)
గంధం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః గంధం సమర్పయామి
(కలశంపై గంధం చిలకరించాలి)
అక్షతలు:
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః అక్షతాన్ సమర్పయామి
(అక్షతలు వేయాలి)
పుష్పం:
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పుష్పైః పూజయామి
(అమ్మవారి కలశం ముందు పుష్పం
ఉంచాలి).
అధాంగ
పూజ: పుష్పాలు లేదా అక్షతలతో కలశాన్ని
పూజించాలి. అనంతరం అష్టోత్తర శతనామాలతో అర్చిస్తూ, పుష్పాలతో పూజించాలి).
దూపం: శ్రీ వరలక్ష్మీ దేవతాయై
నమః ధూప మాఘ్రాపయామి (అగరు
వత్తులు వెలిగించి ఆ ధూపాన్ని అమ్మవారికి
చూపాలి) దీపం: శ్రీ వరలక్ష్మీ
దేవతాయై నమః దీపం దర్శయామి
ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి
(దీపం చూపించి ఉద్ధరిణెతో కొంచెం నీటిని అర్ఘ్యపాత్రలో వేయాలి)
నైవేద్యం:
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి
(ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)
పానీయం:
ఘనసార సుగంధేన మిశ్రీతం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవీ శీతలం సుమనోహరమ్
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి
(ఉద్ధరిణెతో నీటిని అర్ఘ్యపాత్రలో ఉంచాలి)
తాంబూలం:
పండు, పుష్పం, వక్క, దక్షిణతో కూడిన
తాంబూలాన్ని అమ్మవారి వద్ద ఉంచాలి.
నీరాజనం:
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి
(ఘంటానాదం చేస్తూ కర్పూర హారతిని అమ్మవారికి చూపించాలి)
మంత్రపుష్పం:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్రపుష్పం సమర్పయామి
(పుష్పాలను అమ్మవారి ఎదుట ఉంచాలి)
ప్రదక్షిణ:
యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం
పాపకర్మాహం పాపాత్మా పాప సంభవా త్రాహిమాం
కృపయాదేవి శరణాగత వత్సలే అన్యధా శరణం నాస్తి త్వమేవ
శరణం మమ తస్మాత్ కారుణ్య
భావేన రక్ష రక్ష జగధారిణి
శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
(ముమ్మారు ప్రదక్షిణ చేయాలి)
నమస్కారం:
నమస్తే లోక జననీ నమస్తే
విష్ణు వల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి
(అమ్మవారికి అక్షతలు సమర్పించి నమస్కరించాలి)
తోరపూజ:
తోరాలను అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో
పూజించి, తోరం కట్టుకోవాలి. తర్వాత
వరలక్ష్మీ వ్రతకథ చదువుకొని అక్షతలు వేసుకుని, ముత్తయిదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి, పూజచేసిన వారు కూడా తీర్థప్రసాదాలు
స్వీకరించాక, అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని ఆరగించాలి.
వతానికి
సమకూర్చుకోవలసిన సంభారాలు
పసుపు,
కుంకుమ, వాయనానికవసరమైన వస్తువులు, అక్షతలు, ఎర్రటి రవికె, గంధం, పూలు, పండ్లు,
తమలపాకులు, వక్కలు, తోరాలు చేసుకోవడానికి తగినంత నూలు దారం, 5 కొబ్బరికాయలు,
దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి
ఇవ్వడానికి అవసరమైన పంచహారతి, దీపారాధనకు ఆవునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, అర్ఘ్య పాత్ర (చిన్నగిన్నె) తదితరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పసుపు గణపతిని తయారు
చేసి ఉంచుకోవాలి.
వరలక్ష్మి
వ్రత కధ (శ్రావణ శుక్రవారం
కథ)
ఒకనాడు పరమేశ్వరుడు కైలాస గిరియందు సకల
మునిగణ సంసేవితుడైయున్న సమయంబున పార్వతీ దేవి వినయంబుగా, "ప్రాణేశ్వరా!
స్త్రీలు సకలైశ్వర్యములు కలిగియుండుటకు ఆచరించదగిన వ్రతమేదియో సెలవీయు"డని కోరెను. అంతట
పరమేశ్వవరుడు, "దేవీ! వరలక్ష్మి వ్రతమనునది
స్త్రీలకు సౌభాగ్యమొసగును.
దానిని శ్రావణమాసమందు పౌర్ణమికు ముందు వచ్చు శుక్లపక్ష
శుక్రవారము నాడు చేయవలెను" అనెను.
అది విని యామె, "స్వామీ!
ఆవ్రతం ఎలా ఆచరించవలెనో సెలవీ"య వేడెను. ఇంకా
'ఆ వ్రతాన్ని మునుపు ఎవరాచరించి తరించారో తెలుపగోరెద' ననెను. అంతట పరమేశ్వరుడు "ఓ
పడతీ! ఆ వ్రతకధను చెప్పెదను
వినుము" అని కధ చెప్పెను.
పూర్వము మగధ రాజ్యమున కుండిన
నగరమను నొక పురము గలదు.
అది బహుసుందరమయిన పట్టణము. అందు చారుమతి యను
ఒక సాధ్వి కలదు. ఆమె సద్గుణములకు
మెచ్చి ఆదిలక్ష్మి ఆమె స్వప్నమున ప్రత్యక్షమై
ఆమెతో, "చారుమతీ! నీసధ్గుణములకు నేను మెచ్చితిని నీకు
కావలయు వరములనొసగు తలంపు నాకు కలిగెను.
కావున నీవు శ్రావణ పౌర్ణమి
ముందు వచ్చు శుక్రవారమునాడు వరలక్ష్మీ
వ్రతము చేయుము. అప్పుడు నీవు కోరిన కోరికలను
దీర్చెద" నని చెప్పి మాయమయ్యను.
వెంటనే ఆమె మేల్కొని, తన
స్వప్న వృత్తాంతము తన భర్తకు నివేదింప
నతడునూ మిగుల సంతోషించి ఆమెనా
వ్రతమును చేయుటకు ప్రోత్సహించెను. ఆస్వప్న వృత్తాంతము తెలిసిన ఆ పట్టణ స్త్రీలు
శ్రావణమాసం కొరకు ఎదురుచూచుచుండిరి. అంతలో
శ్రావణమాసము వచ్చెను. అంతట చారుమతి వారందరితో
కలసి నిర్ణీత దినమున స్నానాదులు ఆచరించి, ఒక చోట ఆవు
పేడతో అలికి, బియ్యముతో మంటపమేర్పరచి మర్రిచిగుళ్ళు మొదలగు పంచ పల్లవులతో కలశం
ఏర్పరచి, అందు వరలక్ష్మిని ఆవాహనం
చేసి, సాయంత్రం అయ్యా అధిక భక్తితో
లక్ష్మీo క్షీరసముద్రరాజతనయాం| శ్రీ రంగథామేశ్వరీం|
దాసీభూత సమస్తదేవ వనితాం| లోకైక దీపాంకురాం|
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవః| బ్రహ్మేంద్ర
గంగాధరాం|
త్వాం త్రిలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియాం||
అని స్తుతించి, తొమ్మిది రంగులు గల తోరణము కుడిచేతికి
గట్టుకొని, యధాశక్తిని లక్ష్మీదేవికి ఫలభక్ష్య పానీయ పాయసాదులు నైవేద్యముగా
సమర్పించి, ప్రదక్షణ మొనర్చెను. అట్లు వారు ప్రదక్షణము
చేయుచుండగా ఘల్లు ఘల్లు మని
ధ్వని వినిపించుటచే వారు క్రిందకి చూడగా
వాళ్ళ కాళ్ళకు గజ్జెలు, అందెలు మున్నగు ఆభరణములు కనిపించెను.
కానీ భక్తి తప్పక వారు
రెండొవసారి ప్రదక్షణము చేయగా వారి హస్తములు
నవరత్నఖచిత కంకణ సుందరము లయ్యెను.
మూడవ ప్రదక్షణము చేసిన వెంటనే వారి
యిండ్లు సకల సంపత్సమృధ్ధము లయ్యెను.
పిమ్మట చారుమతీ వ్రతము చేయించిన బ్రాహ్మణులకు యధావిధిగా యధాశక్తిని దక్షిణ తాంబూలాదుల నొసంగి సంతుష్టిని చేసి పంపి, వ్రత
ప్రసాదములను బంధుమిత్రాదులకు పెట్టి, తానునూ భుజించి, సుఖముగా నుండెను.
ఆమె లోకోపకారముగా నిట్టి వ్రతమును జేయించినందులకు ఊరిలోనివారందరూ ఆమెను వేనోళ్ళ బొగడిరి.
నాటి నుండి స్త్రీలందరూ ఆ
వ్రతమును ప్రతి సంవత్సరమూ చేయుచుండిరి.
ఆ వ్రతమును అన్ని వర్ణముల వారునూ
జేయవచ్చును. ఆ వ్రతాచరణము వలన
వరలక్ష్మీ ప్రసాదము కలిగి సకల కార్యములందునూ
విజయము చేకూరును.
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్
శాఖ
No comments:
Post a Comment