జంథ్యాల పౌర్ణమి
"శ్రావణపౌర్ణమి"నే జంథ్యాల పౌర్ణమిగా
బ్రాహ్మణులు పండుగ చేసుకుంటారు. కొన్ని
చోట్ల రుషి తర్పణం అని
కూడా పిలుస్తారు. ఆ రోజున గాయత్రీ
మంత్రం జపిస్తూ, వేదమంత్రాల మధ్య పాత యజ్ఞోపవీతం
తీసివేసి కొత్తది ధరిస్తారు. ఈ జంథ్యాల పౌర్ణమి
భారతీయ సంస్కృతికి చిహ్నం. యజ్ఞోపవీతధారణ అనంతరం కొబ్బరితో చేసిన స్వీట్లు అందరికీ
పంచుతారు. "జంథ్యం" వేసుకునే ప్రతి వ్యక్తి దీన్ని
పాటిస్తాడు.
దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం
ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే
చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల
ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత
కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం
తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు
చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు
తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్కు రక్షాబంధనాన్ని
పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన
హుమయూన్ ఆ రాణిని తన
సోదరిగా భావించి బహదూర్షాను తరిమి వేశాడని ఆనాటి
నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి
వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ
రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి
కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా
(నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో
ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్
అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ
పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను
ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ
పేరు వ్యవహారంలోకి వచ్చింది.
ఇక శ్రీ
మహావిష్ణువు విజయగాధా పరంపరలలో హయగ్రీవావతారంలో జరిగిన విజయం కూడా విశేషంగా
చెబుతారు. పూర్వం ఓసారి హయగ్రీవుడు అనే
ఓ రాక్షసుడు దేవిని గురించి తీవ్రంగా తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన
దేవి వరం కోరుకొమ్మన్నప్పుడు తనకు మరణం
లేకుండా చూడమన్నాడు. అయితే అది ఆమె
సాధ్యపడదని చెప్పినప్పుడు హయగ్రీవం (గుర్రపు తల) ఉన్నవాడి చేతిలో
మాత్రమే తనకు మరణం వచ్చేలా
అనుగ్రహించమన్నాడు. ఆమె ఆ రాక్షసుడిని
అనుగ్రహించి అంతర్థానమైంది. ఆ వరంతో ఆ
రాక్షసుడు దేవతలను ముప్పతిప్పలు పెడుతుండేవాడు. విష్ణుమూర్తి ఆ రాక్షసుడిని యుద్ధంలో
నిరంతరం ఎదిరిస్తున్నా ఫలితం లేకపోయింది. చివరకు
శివుడు ఓ ఉపాయాన్ని పన్నాడు.
శ్రీ మహావిష్ణువు ధనుస్సుకు బాణాన్ని సంధించి ఉంచి విపరీతమైన అలసట
కలిగి అగ్రభాగాన వాలి నిద్రపోయాడు. ఆయనను
నిద్రలేపటానికి దేవతలెవరికీ ధైర్యం చాలలేదు. అయితే ఆ దేవతలంతా
ఓ ఆలోచనకు వచ్చి వమ్రి అనే
ఓ కీటకాన్ని పంపి ధనుస్సుకున్న అల్లెతాడును
కొరకమని చెప్పారు. అలా చేస్తే తాడు
వదులై విల్లు కదలి విష్ణువుకు మెలకువ
వస్తుందన్నది వారి ఆలోచన. అయితే
ఆ పురుగు తాడును కొరకగానే దేవతలు ఊహించని విధంగా వింటికి ఉన్న బాణం విష్ణువు
మెడకు తగిలి ఆ దెబ్బకు
విష్ణువు తల ఎటో ఎగిరి
వెళ్ళింది. దేవతలు అంతటా వెదికారు కానీ
ఆ తల కనిపించలేదు. బ్రహ్మదేవుడు
వెంటనే దేవిని గురించి తపస్సు చేశాడు. అప్పుడామె ప్రత్యక్షమై ఒక గుర్రపు తలను
తెచ్చి విష్ణుమూర్తి శరీరానికి అతికించమని చెప్పింది. దేవతలు అలాగే చేశారు. ఆ
హయగ్రీవం అతికిన విష్ణుమూర్తిలో మళ్ళీ జీవం వచ్చి
లేచాడు. ఆ లేచిన రోజే
శ్రావణ పూర్ణిమ. ఆ తర్వాత హయగ్రీవుడుగా
మారిన విష్ణుమూర్తి రాక్షసుడిని సులభంగా జయించాడు. దేవీ శక్తి మహిమను,
శ్రీ మహావిష్ణు తత్వాన్ని ఈ కథ తెలియచెప్తుంది.
అందుకే శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ జయంతి
కూడా జరపడం కనిపిస్తుంది.
యజ్ఞోపవీతం పరమపవిత్రం
ప్రజాపతే ర్యత్స హజం వురస్తాదా
యుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః !!
బ్రాహ్మణులు యజ్ఞోపవీతం కు పూజ చేసి
నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఇలా శ్రావణ పూర్ణిమను ఎన్నెన్నో రకాలుగా పండుగగా, ఉత్సవంగా జరుపుకోవడం తరతరాలుగా వస్తోంది.
హయగ్రీవావతారం
సకల చరాచర సృష్టికి కర్త అయిన బ్రహ్మకు
శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో
నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని
గురించి ఈ కథ తెలియజేస్తుంది.
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా
ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది
వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా
హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో
ఆసీనుడై ఉన్న సృిష్టికర్త బ్రహ్మ
తన పనిలో తాను నిమగ్నమై
ఉండగా మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు
గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి మనోహర రూపాలతో
భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు. బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో
ప్రవేశించి రసాతలానికి చేరారు.
వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని,
వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే
తనకు ముఖ్య ఉపస్యాలని అవి
లేకపోతే తాను సృష్టిని చేయడం కుదరదని విచారిస్తూ
ఆ ఆపద నుంచి ఎలా
బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు
వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు.
బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం
యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు.
ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది.
ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా
మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి.
ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి
లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా,
సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే
ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన
కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి.
ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన
శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై
రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త,
అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ
మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ
గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ
గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి
బ్రహ్మ దగ్గర నుంచి తాము
తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం
చేసి గానం వినిపించిన దిక్కుకు
పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు
రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని
సముద్ర గర్భం నుంచి బయటకు
వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని
విడిచి తన స్వరూపాన్ని పొందాడు.
రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు
బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ
వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే
తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి
వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు.
వెంటనే ఆ ఇద్దరూ రసాతలం
నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ
కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద
యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు.
ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను
అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ
దగ్గర నుంచి వేదాలను తెచ్చినది
కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని
కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు.
అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం
చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ
లక్ష్యంగా అవతరించింది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment