రాఖీ పౌర్ణమి
'యేన బద్ధో బలీ రాజా
దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి
రక్షే మా చల మా
చల'
అంటూ బలిచక్రవర్తి రక్షకోరిన సోదరిని రక్షిస్తూ ఎలాంటి ఆటంకాలెదురైనా తడబడక ధైర్యంతో ఎదురొడ్డి
నిలిచినవాడు. అటువంటి మహావీరునితో తన అన్నని పోలుస్తూ
తనకి రక్షణ నివ్వమని కోరుతుంది.
ఈ రాఖీ కట్టిన సోదరికి
తగిన బహుమానం ఇస్తూ ఆశీర్వధిస్తాడు అన్న.
రాఖీ పౌర్ణమి, శ్రావణ పున్నమిరోజును యిలా ఎన్నోరకాలుగా దేశమంతా
ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. దేవతారాధనలు, ప్రకృతి దేవతారాధనలు, ఆత్మీయతానురాగబంధాలు... సకల పూజారాధనలు అందుకునే
రోజు ఈ శ్రావణ పౌర్ణమి. రాకీలతోపాటు పూజాథాలీ( పూజ పళ్ళాలు) అలంకరణ
కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
శ్రావణ
పూర్ణిమకు భారతీయ సంప్రదాయంలో ఓ ప్రత్యేక స్థానం
ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ
రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు.
ఈ పండుగ మూడు నాలుగు
రకాలుగా ఉంది. రక్షాబంధనం (రాఖీ)
పండుగ గానూ, హయగ్రీవ పూజ,
వరుణ పూజల రూపంలో ఈ
పూర్ణిమను ఉత్సవంగా అందరూ జరుపుకుంటుంటారు. భవిష్యోత్తర
పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు
కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును వివరించాడు.
రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా
దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని,
అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా ఓ
కథను కూడా ఆయన వివరించాడు.
పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు ఘోర యుద్ధం జరుగుతుండేది.
ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి
ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి
భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ
తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి
ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో
చదివే శ్లోకం. చరిత్రలో మొగలాయి చక్రవర్తుల పాలనలో ఈ రక్షాబంధనానికి నూతనమైన
విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం
తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు
చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను
ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ
చక్రవర్తిగా ఉన్న హుమయూన్కు
రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ
రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన
సోదరిగా భావించి బహదూర్షాను తరిమి వేశాడని
ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి
గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి
వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ
రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి
కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా
(నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో
ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్
అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ
పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను
ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ
పేరు వ్యవహారంలోకి వచ్చింది. రక్షాబంధనానికి సంబంధించి ఇతర పురాణ కథలు
కూడా ఉన్నాయి. పౌరాణిక గాథలు ఎలా ఉన్నప్పటికీ
ఆధునిక కాలంలో రాఖీ పౌర్ణమి సోదర
సోదరీమణుల మధ్య ఆప్యాయతకు, ప్రేమకు
ప్రతీకగా మారింది. ఏడాదిలో అన్నిటి కన్నా సోదరసోదరీమణుల మధ్య
ప్రేమకు ఈ పర్వదినమే ప్రతీకగా
నిలుస్తుంది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment