బీష్మ ఏకాదశి
కురుక్షేత్ర సంగ్రామంలో తీవ్రంగా గాయపడి, తన ఇష్టానుసారం కురు
పితామహుడు భీష్మాచార్యుడు గతించిన రోజు భీష్మ ఏకాదశి.
తిథి నక్షత్రాలను, వార వర్జ్యాలను పాటించేవారు
ఏకాదశిని మంచిరోజుగా భావిస్తుంటారు. భీష్మ ఏకాదశిని మరింత
పవిత్రమైన రోజుగా భావిస్తారు. భీష్మ ఏకాదశికి సంబంధించి
పురాణాల్లో ఓ కథ ఉంది.
భీష్ముడి గురించి తెలియని వారుండరు.
మహాభారతంలో భీష్ముడిది
చాలా గొప్ప పాత్ర. మహాభారత
గాథకు మూల స్తంభమైన భీష్ముడు
పుట్టగానే గంగాదేవి వెళ్ళిపోతుంది. ఇతని మొదటి పేరు
దేవపుత్రుడు. శంతనుడు దాసరాజు కుమార్తె సత్యవతిని ఇష్టపడతాడు. ఆమెతో తండ్రి వివాహం
కోసం దేవపుత్రుడు రాజ్యాన్ని వదులుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పటినుంచి గాంగేయుడు ‘భీష్ముడు’ అయ్యాడు.
సత్యవతితో తన వివాహం కోసం
సామ్రాజ్యాన్ని వైవాహిక జీవితాన్ని కుమారుడు భీష్ముడు త్యాగం చెయ్యడంతో శంతనుడు బాధపడతాడు. ఇంత త్యాగం చేసిన
కుమారునికి స్వచ్చంద మరణాన్ని వరంగా ప్రసాదిస్తాడు. అనంతరం
పాండవులు, కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతుంది. ఆ యుద్దంలో పదిరోజులు
తీవ్రంగా యుద్ధం చేసిన భీష్ముడు అర్జునుని
ధనుర్భాణానికి నేలకొరిగి శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను
ఆశ్రయిస్తాడు. దీన్ని తలపునకు తెచ్చేది ఏకాదశి వ్రతం.
కార్తీక శుద్ధ ఏకాదశినాడు అంపశయ్యను
ఆశ్రయించిన భీష్ముడు మాఘశుద్ధ అష్టమి నాడు మరణించినట్టుగా పలు
పురాణ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఉత్తరాయణం మాఘశుద్ధ అష్టమి రోజు ప్రవేశించినట్టుగా ప్రమాణాలు
ఉన్నాయి. నిర్ణయ సింధువులలోనూ, భీష్మ సింధువులలోనూ, ధర్మ
సింధువులలోనూ మాఘ శుద్ధ అష్టమినాడు
భీష్మునికి తిలాంజలి విడిచి పూజించాలని ఉంది.
భీష్మాష్టమి నాడు భీష్మునికి శ్రాద్ధ
కర్మలు చేసినవారికి సంతానాభివృద్ధి జరుగుతుందని, పుణ్యం ప్రాప్తిస్తుందని పలువురు అంటున్నారు. ఈ కారణంగా భీష్మ
ఏకాదశి, భీష్మాష్టమి పుణ్యదినాలయ్యాయి. పలు పర్వదినాలున్నా అన్నింటినీ
అందరూ చేసుకోన్నట్లే భీష్మ ఏకాదశిని కూడా
బ్రాహ్మణ, క్షత్రియులే పాటిస్తూ వస్తున్నారు. సంతాన భాగ్యానికి దూరమై
మరణించిన భీష్మునికి వారసులమని క్షత్రియులంతా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున
భీష్మునికి తర్పణం వదలటం ఆనవాయితీ. అయితే
భీష్ముడు మరణించిన రోజున బ్రాహ్మణులు ఉపవాసం
ఉండి మర్నాడు ద్వాదశినాడు ఉపవాస దీక్ష విరమిస్తున్నారు.
కొన్ని ప్రాంతాల్లో క్షత్రియులు భీష్మ ఏకాదశి రోజున
పండితులను పిలిపించుకుని భీష్ముని జన్మ వృత్తాంతాన్నంతా చెప్పించుకుంటున్నారు.
సంతాన ప్రాప్తిని కోరే చాలామంది బ్రాహ్మణ,
క్షత్రియేతరులు కూడా భీష్మ ఏకాదశిని
పాటిస్తున్నారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
వరంగల్ అర్బన్ శాఖ
No comments:
Post a Comment