Tuesday, 9 September 2014

మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం)

మహాలయ పక్షారంభం (పితృ పక్షారంభం)
భాద్రపద మాసంలోని కృష్ణపక్షం (భాద్రపద బహుళ పాడ్యమి నుండి అమావాస్య వరకు) పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం అని ప్రతీతి. దీనినే మహాలయ పక్షం అన్నారు. పక్షం రోజులు నియమ పూర్వకంగా పితృదేవతలను తర్పణాదుల ద్వారా తృప్తి పరచాలి. పితరులను తృప్తి పరిచే కర్మల ద్వారా పితృ ఋణం తీర్చుకునే అవకాశం. స్వర్గస్తులైన మాతా పితరుల కోసం ప్రతివారూ పక్షాలలో విధింపబడ్డ పితృ కర్మలను ఆచరించాలి. తద్వారా శ్రేయస్సును పొందగలరు.

ప్రతి యేడూ చేసే శ్రాద్ధం కన్నా, అతి ముఖ్యమైన శ్రాద్ధాలు మహాలయ పక్షం రోజులూ చేయలేని వారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలి.ఆఒక్కరోజు వారు అన్నశ్రాద్ధంపెట్టలేకపోతే, హిరణ్య శ్రాద్ధం చేయాలి. మహాలయంలో ఒక విశేషం - వారి వారి జ్ఞాతి, బంధువు లందరికీ అర్ఘ్యోదక, పిండోదకాలు ఉండగలవు.

కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే |
యాచిత్వాపి నరః కుర్యాత్ పితౄణాం తన్మహాలయం ||
మహాలయ శ్రాద్ధము చేయటానికి శక్తిలేని పక్షంలో, పితరుల ఆమహాలయాన్ని యాచించియైనా ఆచరించాలి.

అందుచేతనే మనిషి చనిపోయిన తర్వాత చేసే కర్మ కాండలకు చాల కీలక ప్రాధాన్యత ఏర్పడింది. మానవులు గతించిన తర్వాత శ్రాద్ధ కర్మలు ఆచరించటం మన సంప్రదాయం. కాని ప్రతిఫలం ఆశించకుండా ఇట్టి శ్రాద్ధ కర్మలను ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసే కన్నా పితృ దేవతలకు తర్పణాలు అందించటం ఎంతో ముఖ్యమని మన మహర్షులు తెలియచేస్తున్నారు. గతించిన తల్లి తండ్రులకు, ఇతరులకు తద్దినాలు, తర్పణాలు, పిండప్రదానాలు ప్రతి సంవత్సరము వారు మరణించిన రోజున ఆచరిస్తుంటారు.

దానశీలిగా పేరుగాంచిన కర్ణుడు మరణానంతరము స్వర్గ లోకానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో ఆకలి, దప్పిక కలగటంతో, తాను సమీపంలోని ఫల వృక్షానికి ఉన్న పండును కోసుకొని.. తినాలనుకునే సమయంలో, పండు కాస్తా బంగారు పండుగా మారిపోయింది. విధంగా సమీపంలో ఉన్న ఫల వృక్షం నుంచి ఫలాన్ని కోసిననూ, అవి కూడా స్వర్ణ ఫలాలుగానే మారిపోతున్నాయి. దప్పిక తీర్చుకుందామని సమీప సెలయేటిలోని నీటిని దోసిలిలో తీసుకున్నప్పటికీ, నీరు స్వర్ణ జలంగా మారటం జరిగింది. స్వర్గానికి వెళ్ళిన తర్వాత కూడా ఇలాగే పరిస్థితి పునరావృత మైనది.

విధంగా జరగటానికి ప్రధాన కారణమేమిటని కర్ణుడు వాపోతుంటే... కర్ణా... ధన, కనక, వస్తు, వాహనాలన్నీ దానం చేసావు గాని ఒక్కరికి కూడా పట్టెడు అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ స్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. వెంటనే కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని ప్రాధేయ పూర్వకంగా ప్రార్ధించగా, సూర్య దేవుని యొక్క అనుగ్రహం మేరకు ఇంద్రుడు అపురూపమైన అవకాశాన్ని కర్ణునికి ఇచ్చాడు.

అదేమిటంటే తక్షణమే భూ లోకానికి వెళ్లి అక్కడ వారందరికీ అన్న పానీయాలను అందచేసి, మాతా పితరులందరికీ తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి రావటము. ఇంద్రుని అవకాశం మేరకు కర్ణుడు భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి రోజున భూలోకానికి రావటము, ఇక్కడ పేదలకు అన్న సంతర్పణలు, పితరులకు తర్పణ, పిండ ప్రదానాలు వదిలి తిరిగి భాద్రపద అమావాస్య రోజున స్వర్గానికి వెళ్ళాడు. ఇట్టి అన్న సంతర్పణలు, పితృ తర్పణాలు చేసినందున స్వర్గ లోకంలో కర్ణుడు సుఖంగా ఉండటానికి అవకాశం లభించింది.

కర్ణుడు భూలోకానికి వచ్చి, ఇక్కడ కొద్ది రోజులు ఉండి తిరిగి స్వర్గానికి వెళ్ళిన పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. మహాలయ పక్షంలోని చివరి రోజునే మహాలయ అమావాస్య అంటారు.
ప్రస్తుత యాంత్రిక యుగంలో పితృ దేవతలకు శ్రాద్ధ కర్మలు (తద్దినాలు) పెట్టటము మానుతున్నారు. సమయం లేక కొంతమంది, బ్రాహ్మణులు దొరకక ఇంకొంతమంది, గృహంలో అనారోగ్య కారణాలచే శుచితో (మడి) వంట చేసేవారు లేక అలాగే వంట వారు దొరకక, మరికొన్ని సందర్భాలలో శ్రాద్ధ కర్మలు ఆచరిస్తే పితృ దేవతలకు చేరతాయా అనే హాస్యాస్పద ధోరణితో.... ప్రస్తుత కాలంలో తద్దినాలు తగ్గిపోతున్నాయి. కారణాల వలన వంశాభివృద్ధి జరగటంలేదనేది అక్షర సత్యము.

ఆచార వ్యవహారాల మీద మహా విశ్వాసం ఉన్న వారికి కూడా, తమ తమ ఉద్యోగ వ్యాపారాల వలన కాని ఇతర అనారోగ్యాల వలన కాని ఒక్కోసారి సమయం దొరక్క, రోజున వారి పితృ దేవతలను స్మరిస్తూ, యా రోజులలో కొన్ని పుణ్యక్షేత్రాలలోని నిత్యాన్నదాన సత్రాలలో తమ పెద్దల పేరుతో, తమ శక్తికి తగినట్లుగా అన్నసంతర్పణ గావిస్తున్నారు. ఏమి చేయలేని ఆర్ధిక దుస్థితి లో ఉన్నవారు... సమీపంలో ఉన్న వృక్ష సముదాయాల దగ్గరకు వెళ్లి, వృక్షాన్ని హత్తుకొని పితరులను ఉద్దేశించి కన్నీరైన కార్చవలెనని ధర్మ శాస్త్రం తెలియచేస్తుంది.

శ్రుణ్వంతు పితరః సర్వేమత్కులీనావచోమమ |
అహందరిద్రః కృపణోనిర్లజ్జః క్రూరకర్మకృత్ ||
ప్రాప్తోభాద్రపదోమాసః పితౄణాం ప్రీతి వర్ధనః |
కర్తుం మహాలయ శ్రాద్ధం నచమేశక్తిరస్తివై ||
భ్రమిత్వాపి మహీంకృత్స్నాం సమేకించనలభ్యతే |
అతోమహాలయ శ్రాద్ధం నయుష్మా కంకరోమ్యహం ||
క్షమధ్వం మమ తద్యూయం భవంతోహిదయాపరాః |
దరిద్రోరోదనం కుర్యాత్ ఏవంకాననభూమిషు ||
తస్యరోదన మాకర్ణ్య పితరస్తత్కులోద్భవాః |
హృష్టాన్తృప్తిం ప్రయాంత్యేవసుధారీపత్వైవనిర్జరాః ||
పితరులకు ప్రీతిని పెంచే భాద్రపదమాసం వచ్చింది. మహాలయ శ్రాద్ధము చేయటానికి నాకు శక్తిలేదు.  భూమి అంతా తిరిగినా నాకేమీ లభించటంలేదు. అందువల్ల మహాలయశ్రాద్ధాన్ని మీకొరకు నేను చేయటంలేదు.  మీరుదయగల వారైనాఈపనిని మీరు క్షమించండి. దరిద్రుడుఇట్లాగేఅరణ్యప్రదేశములందు ఏడవాలి అతని ఏడుపునువిని ఆతని కులంలో పుట్టిన పితరులు సంతుష్టులై, దేవతలు అమృతాన్ని త్రాగి తృప్తులైనట్లు తృప్తులౌతారు.

--- శ్రీ స్కాంద మహా పురాణమందు ఏకాశీతి సహస్ర సరిహతయందు తృతీయ బ్రహ్మఖండమందు సేతుమాహాత్మ్యమందు ధనుష్కోటి ప్రశంస యందు దురాచారుని సంసర్గ దోషశాంతి వర్ణన మనునది ముప్పది ఆరవ అధ్యాయము నుంచి..
     వల్లూరి పవన్ కుమార్                         
  - బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ 
  


No comments:

Post a Comment