తిరుమల బ్రహ్మోత్సవం
భాద్రపదమాసంలో శుక్లపక్షం ఏకాదశి శ్రవణానక్షత్రం సోమవారంనాడు నారాయణగిరిలో స్వామి పుష్కరిణి తీరంలో ఈ శ్రీనివాసుడు ఆవిర్భవించాడని
పద్మపురాణం చెబుతోంది. దేవతల కొలువులందుకుని వేంకటాచలంలో
వెలసిన శ్రీ వేంకటేశునికి కన్యామాసంలో
ధ్వజారోహణాది ఉత్సవాలను సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడు ప్రారంభించాడు.
‘వేం’ అనగా పాపాలు, ‘కట’
అంటే దహింప (నశింప) చేసేదని అర్థం. సర్వపాపాలను, పాపఫలితాలైన దుఃఖాలను నశింపజేసేదే ఆనంద నిలయం. ఇది
అర్థపరమైన నిర్వచనం. శబ్దశక్తిని అనుసరించి చూస్తే ‘వేం’ అమృతశక్తి బీజం.
‘కటం’ ఐశ్వర్య బీజం. అమృత తత్వం
(కైవల్యం, ఆనందం), ఐశ్వర్యం కలగలిపిన శక్తివంతమైన క్షేత్రం ఇది. ఆ క్షేత్రం
వేంకటగిరిపై వెలసిన ప్రభువే శ్రీ వేంకటేశ్వరుడు. అందుకే
ఈ బ్రహ్మోత్సవాలకు వెళ్లే యాత్రికులు, తమ ఇండ్లనుంచి వేసే
ప్రతి అడుగుకు ఒక్కొక్క క్రతువు చేసిన ఫలం దక్కుతుందని,
అలా వెళ్ళే భక్తులకు యథాశక్తిగా సేవచేసేవారికి శ్రీనివాసుని అనుగ్రహం కలుగుతుందని, అలాగే యాత్రికులకు అపకారం
చేసినవారికి భయంకరమైన రౌరవ నరకం తప్పదని
వామన పురాణం ఘోషిస్తోంది. అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన ఆ
శ్రీ వేంకటేశుని వైభవాన్ని వర్ణించటం ఎవరితరం కాదు.
శ్రీ వేంకటేశునికి సంవత్సరం పొడుగునా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు ఎన్నో. వీటిలో నవాహ్నిక బ్రహ్మోత్సవాలు అతి విశిష్టమైనవి. నవ
బ్రహ్మలు నవహ్నిక దీక్షతో నిర్వహిస్తారు కనుక ఇవి బ్రహోత్సవాలుగా
ప్రసిద్ధి పొందాయి. ‘కలౌ వేంకటనాయక’ అని
ప్రసిద్ధి పొందిన దేవ దేవుడైన శ్రీనివాసుడు
వేంకటాచల క్షేత్రంలో వెలసిన తొలినాళ్లలోనే బ్రహ్మదేవుడిని పిలిచి జగత్ కల్యాణం కోసం
తనకు ఉత్సవాలు నిర్వహించి ఘనంగా నివేదనాదులు చేయవలసిందిగా
ఆజ్ఞాపించాడు.
శ్రీ స్వామివారి ఆజ్ఞప్రకారమే శ్రీ వేంకటేశ్వరుడు ఆనంద
నిలయం మధ్యలో ఆవిర్భవించిన కన్యామాసం (ఆశ్వయుజం)లోని శ్రవణానక్షత్రం నాటికి
పూర్తయ్యేటట్టుగా బ్రహోత్సవాలను నిర్వహించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు ప్రారంభించిన ఈ పదినాళ్ల ఉత్సవాలను
కాలక్రమంలో ఎందరో రాజులు తమ
విజయపరంపరలకు కృతజ్ఞతగా తిరుమల శ్రీనివాసునికి బ్రహ్మోత్సవాలు పేరిట ఉత్సవాలను నిర్వహించేవారు.
అవి నెలకు ఒకటి వంతున
ప్రతియేటా పండెండ్రు బ్రహ్మోత్సవాలు జరిగేవట. ఆ తరువాత…
క్రీ.శ. 1254 చైత్రమాసంలో తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, క్రీ.శ. 1328 ఆషాఢ
మాసంలో ఆడి తిరునాళ్లను త్రిభువన
చక్రవర్తి తిరువేంకటనాధ యాదవ రాయలు, క్రీ.శ. 1429 ఆశ్వయుజ మాసంలో వీరప్రతాప రాయలు, క్రీ.శ. 1446లో
మాసి తిరునాళ్ల పేరుతో హరిహరరాయలు, క్రీ.శ. 1530లో
అచ్యుతరాయ బ్రహ్మోత్సవంగా అచ్యుతరాయలు, ఇలా క్రీ.శ
1583నాటికి సంవత్సరంలో ఇంచుమించు ప్రతి నెల ఒక
బ్రహ్మోత్సవం జరిగేదన్న విషయం బోధపడుతుంది. ఆ
రాజులు, వారి రాజ్యాలు కాలగర్భంలో
కలిసిపోయినందువల్ల వారు ఏర్పాటు చేసిన
ఉత్సవాలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కాని అలనాడు శ్రీనివాస
ప్రభువు ఆనతిమేరకు జగత్ కళ్యాణం కోసం
సృష్టికర్త బ్రహ్మదేవుడు నిర్వహించిన బ్రహ్మోత్సవాలు మాత్రం అఖండంగా అంగరంగ వైభవంగా కొనసాగుతూ శ్రీనివాసుని విభవాన్ని చాటుతున్నాయి. అందువల్లనే బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఉత్సవాలకు
ముందు బ్రహ్మరధం వెళుతూ ఉంటుంది. ఈ రథంలో నిరాకార
నిర్గుణ బ్రహ్మదేవుడు వేంచేసి ఈ ఉత్సవాలకు ఆధ్వర్యంలో
వహిస్తాడు. ఒక్క రథోత్సవంనాడు మాత్రమే
బ్రహ్మరథం ఉండదు. శ్రీస్వామివారి రథోత్సవంనాడు మాత్రం బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి
తేరుపగ్గాలను పట్టుకుని లాగుతూ రధోత్సవంలో పాల్గొంటారు.
ఈ సంవత్సరం శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 28 బుధవారం నాడు అంకురార్పణతోప్రారంభమై అక్టోబరు 7వ
తేదీ శుక్రవారం చక్రస్నానంతో పూర్తవుతాయి. బ్రహ్మోత్సవాల ఏర్పాటులను స్వయంగా దగ్గరుండి పర్యవేక్షించేందుకు స్వామివారి సేనాధిపతి విష్వక్ష్సేనుడు ఆలయంలోని నైరుతి దిశలో ఉండే వసంత
మండపానికి విచ్చేస్తారు. ఆ తరువాత నిర్ణీత
పునీత ప్రదేశంలో భూదేవి ఆకారాన్ని లిఖించి ఆ ఆకారంలోని నందులాట,
బాహు, స్థన ప్రదేశాలనుండి మట్టిని
తీసి స్వామివారి ఆలయంలోకి వస్తారు. దీనినే మ్రిత్సంగ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన
తొమ్మిది పాళికలలో శాలి, ప్రహి, యవ,
ముద్గ, మాష, ప్రియంగు మొదలగు
నవధాన్యాలను పోసి పూజలు చేస్తారు.
ఈ కార్యక్రమానికి సోముడు అధిపతి, శుక్లపక్ష చంద్రునిలా పాళికలలోని నవధాన్యాలు దినదినాభివృద్ధి చెందాలని ప్రార్ధిస్తారు. పాళికలలో వేయగా మిగిలిన మట్టితో
యజ్ఞకుండాలను నిర్మిస్తారు. తరువాత పూర్ణకుంభ ప్రతిష్ట జరుగుతుంది. అంకురాలను ఆరోపింపజేసే కార్యక్రమం కాబట్టి ఇది అంకురార్పణ అయ్యింది.
బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యే తొలిరోజు ధ్వజారోహణాన్ని నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం
స్వామివారికి సుప్రభాత, తోమాల సేవలు జరిగాక
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి
ఏకాంతంగా తిరుమంజన ప్రక్రియను నిర్వహించి నైవేద్యం సమర్పిస్తారు. ఆలయ సన్నిధిలోని ధ్వజస్తంభంమీద
పతాకావిష్కరణ చేస్తారు. స్వామివారి వాహనం గరుడుడు కాబట్టి
ఒక నూతన వస్త్రం మీద
గరుడుని బొమ్మ చిత్రీకరించి గరుడధ్వజ
పటం సిద్ధంచేసి దాన్ని ఊరేగించి, ధ్వజస్తంభం వద్దకు తెచ్చి ఉత్సవమూర్తులైన భోగశ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో కొడితాడుకు కట్టి పైకి చేరుస్తారు.
ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడపతాకమే
ముక్కోటి దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రం. ఈ బ్రహ్మోత్సవాలు జరిగే
తొమ్మిది రోజులలోనూ ముక్కోటి దేవతలందరూ శ్రీవారి ఆలయం చుట్టూ తిరుగుతుంటారని
మన పురాణాలు చెబుతున్నాయి. ధ్వజారోహణం తరువాత సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామిని
పుష్పమాలాంకృతుల్ని చేసి వాహన మండపంలో
ఉన్న పెద్ద శేషవాహనంపై ఊరేగిస్తారు.
తరువాత ఉత్సవమూర్తులను రంగనాయక మండపంలో ఉంచుతారు. స్వామి కొలువుతీరి ఉన్న శేషాద్రి. అందుకే
ఏడు తలలున్న పెద్ద శేష వాహనంపై
స్వామివారి ఊరేగింపు, బ్రహోత్సవాలలో అతి ప్రధానమైనది. అలా
మొదలైన బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో పూర్తవుతాయ. ఈ రోజున స్వామి
పుష్కరిణిలో స్నానమాచరిస్తే సర్వపాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం. చక్రస్నానం పూర్తయిన తరువాత అదేరోజు సాయంత్రం శ్రీవారి ఆలయ ధ్వజస్తంభం మీద
ఆరోహణ చేసిన గరుడ పతాకాన్ని
అవరోహణం చేస్తారు. ఈ అవరోహణంతో బ్రహ్మోత్సవాలకు
విచ్చేసిన ముక్కోటి దేవతలకు వీడ్కోలు పలికినట్లు అవుతుంది. బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పూర్తయినట్లు భావిస్తారు. ఇన్ని విశేషాలు కలిగిన
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలను
వీక్షించిన వారందరిదే పుణ్యం. అలాంటివారందరికీ ఆ స్వామి అష్టయిశ్వర్యాలను,
సకల శుభాలను ప్రసాదిస్తారు.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment