Tuesday, 23 September 2014

బతుకమ్మ పండుగ ప్రారంభం

బతుకమ్మ పండుగ ప్రారంభం (పెత్రమవస్య)
బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందు వచ్చే అమావాస్య రోజుపెత్రమవస్యగా లేకఎంగిలిపూవు బతుకమ్మగా పిలుచుకుంటూ ఆనాటి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు వేడుకలు కొనసాగిస్తం. ‘మహర్నవమిగా నవమిరోజుసద్దుల పండుగపేరుతో తిరిగి పెద్ద ఎత్తునబతుకమ్మ పేర్చుకొని వైభవంగా పండుగను జరుపుకుంటం. తీరుతీరు పూలతో, తీరైన వంటలతో తల్లిని కొలుస్తూ పాడే పాటలు, తమ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో కూడిన పాటలు ఇలా బతుకమ్మ పండుగకు పాడుకునే పాటలు ఎన్నో.
అంతేకాదు, పండుగ ప్రారంభం నుండి తొమ్మిదవ రోజు వరకే గాకుండా, బతుకమ్మను సాగనంపే వరకు ఎన్నో సన్నివేశాలు. సన్నివేశాలకు తగిన పాటలు, ఆటలు నిజంగా చూసే కన్నులకు, వినే చెవులకూ ఆనందమే.

పెత్రమావాస్య రోజు జరుపుకునే పండుగనుఎంగిలిపూవు బతుకమ్మగా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పిలుస్తం. పండుగకు ఒకరోజు ముందు నుండే పూలను సేకరించి నీళ్ళలో వేస్తం. అయితే, ఎంగిలిపూవు బతుకమ్మ లేక పెత్రమావాస్య రోజు తమ పెద్దలకు నైవేద్యాలు సమర్పిస్తం. పెత్రమావాస్య రోజు పెద్దవిగా బతుకమ్మలను పేర్చి, సంబరం చేసుకుంటూ ఆనాటి నుండి తొమ్మిది రోజులు, దుర్గా నవరావూతుల్లో ప్రతిరోజు బతుకమ్మలను పేరుస్తం. తొమ్మిది రోజులు రకరకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడటంతోపాటు ఆట అనంతరం స్త్రీలు రకరకాల వాయినాలను ఇచ్చుకుంటుంటరు.
మొదటి రోజు వక్కలు, తులసి ఆకులు, సత్తుపిండి మొదలైనవి. రెండవ రోజు పప్పు, బెల్లం ప్రసాదంగా, మూడవ రోజు బెల్లం వేసి ఉడికించిన శనిగపప్పు, నాలుగో రోజు నానిన బియ్యం (బెల్లం కలిపిన పాలలో నానబెట్టిన బియ్యం), ఐదవ రోజు అట్లు పోసి ప్రసాదంగా పంచుకుంటాం. ఆరవ రోజు బతుకమ్మ పేర్చము, ఆడము. రోజు బతుకమ్మ అలిగిందనే విశ్వాసం ఒకటుంది.

ఏడవ రోజు పప్పు బెల్లం, ఎనిమిదవ రోజు నువ్వులు బెల్లం కలిపిన ముద్దలు ప్రసాదంగా తయారు చేసి పంచుకుంటం. గతంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చడం, వాయినాలు ఇచ్చుకోవడం జరిగేది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తొమ్మిది రోజులు బతుకమ్మలు పేరుస్తున్నారు. ఎక్కువ ప్రాంతాల్లో పెత్రమావాస్య రోజు, సద్దుల బతుకమ్మ నాడు రెండు రోజులు మాత్రమే ఘనంగా జరుపుకోవడం, మధ్య రోజుల్లో బతుకమ్మ ఆడటం చూస్తున్నం.
తొమ్మిదవ రోజు నాటి బతుకమ్మనుసద్దుల బతుకమ్మఅంటం. పండుగ ఉత్సాహం రోజు అధికంగా కనిపిస్తుంది. దసరా పండుగకు ముందురోజు బతుకమ్మ పండుగ. రెండు రోజులు సంతోషంగా గడపడం కోసం పల్లెను చేరే వాళ్ళతో, ఊర్లన్నీ సంబరంగా ఉంటయి. అంతేకాదు, ఎక్కువ పూలతో ఈనాటి బతుకమ్మలను చాలా పెద్దవిగా చేసి, ఐదు రకాల సద్దులు కలిపి నైవేద్యంగా సమర్పించి పూజలు చేస్తుంటం.

బతుకమ్మను పేర్చే విధానం, పూజించే తీరునుబట్టి ప్రజలు తనను ఆరాధించడానికే శక్తి రూపాన్ని కోరిందా అనిపిస్తుంది. శ్రీ చక్రోపాసనం సర్వోత్కృష్టమైన శక్త్యారాధన విధానాల్లో ఒకటి. బతుకమ్మను పేర్చేటప్పుడు కమలం షట్చక్షికం/అష్టదళ పద్మాన్ని వేసి పేర్చడం మొదపూడతారు. శ్రీ చక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటది. శ్రీ చక్రంలోని కుండలినీ యోగ విశేషశక్తిగా బతుకమ్మలో గౌరమ్మను నిలుపడం జరుగుతది. ఇక్కడి స్త్రీలు గౌరమ్మను, లక్ష్మి, సరస్వతిగా భావించి పూజిస్తరు. పాటలను పాడుతుంటరు. ఎన్నో పాటలు ఉన్నప్పటికీ బహుళ ప్రచారంలో ఉన్నపాటశ్రీలక్ష్మి నీ మహిమలు గౌరమ్మ...’
శ్రీ లక్ష్మి నీ మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
భారతి సతివయ్యి
బ్రహ్మ కిల్లాలివై
పార్వతిదేవివై
పరమేశురాణివై
భార్యవైతివి హరునకు గౌరమ్మా...
అలా బతుకమ్మ ఆటలో పాడుకునే మరో గౌరిపాట...
శ్రీగౌరి నీ పూజ ఉయ్యాలో
చేయబూనితివమ్మా ఉయ్యాలో
కాపాడి మమ్మేలు ఉయ్యాలో
కైలాసవాసి ఉయ్యాలో
శంకరీ పార్వతి ఉయ్యాలో
శంభూని రాణి ఉయ్యాలో
తల్లి నిన్నెప్పుడు ఉయ్యాలో
ధ్యానింతునమ్మ ఉయ్యాలో....
-అంటూ రకరకాల పూలతో, పసుపు కుంకుమలతో, నైవేద్యాలతో పూజిస్తామని తెలుపుతూ, జయము శుభము కల్గించమని వేడుకుంటరు.
బతుకమ్మ పండుగ రోజు సాయంకాలం, గ్రామంలోని గుడి ముందరగాని, ఎప్పుడు అందరూ కలిసి జరుపుకునే ఏదేని మైదానానికి చేరుకొని బతుకమ్మ ఆటను ఆడుతరు. బతుకమ్మను పెట్టి ఆడే చోట వెంపలి చెట్టుగాని, పిండిచెట్టు గాని పెట్టి, గౌరమ్మను నిల్పి పూజ చేసి ఆట మొదపూడతరు. స్త్రీలు వలయాకారంగా నిలబడి కుడివైపుకు జరుగుతూ, చప్పట్లు చరుస్తూ, వంగి లేస్తూ, ఒక స్త్రీ పాట చెబుతూ ఉంటే, మిగతా వాళ్ళందరూ పాడుతుంటరు.

ఇలా సాగే బతుకమ్మ ఆట పాటను గమనిస్తే పండుగ ప్రయోజనమేమిటో అర్థమవుతుంది. అన్ని వర్గాలవారు కలిసి ఆడటంలో మానవ సంబంధాలు, సమిష్టి భావనలు పెంపొందుతయి. భారతదేశ ఔన్యత్యాన్ని, తెలంగాణ ప్రశస్థిని తెలిపే సాంస్కృతిక విశిష్టత తరతరాలుగా కొనసాగుతోంది. స్త్రీల సమైక్యత, వారిలోని కళాత్మకత సందర్భంగా చక్కగా వెల్లడవుతుంది.
కుటుంబం, అనుబంధం, చారివూతక నేపథ్యం, పౌరాణికతలు మొదలైనవి జోడించిన పాటల వల్ల రాబోయే తరానికి మౌఖికంగా, ఆచరణాత్మకంగా సాహిత్యాన్ని, వారసత్వాన్ని అందించిన వాళ్ళం కూడా అవుతం.
బతుకమ్మ ఆట తరువాత స్త్రీలు కోలాటాలు వేస్తరు. కోలాటాలను కొన్ని చోట్ల కర్రలతో, మరికొన్ని చోట్ల ఇత్తడి, వెండి కోలలతో, మరికొన్ని ప్రాంతాలలో చేతులతో వేస్తూ ఆనందిస్తరు. కోలాటం పాటలు రసరమ్యంగా, ఆనందంగా, వినోదాత్మకంగా ఉంటయి.
చేమంతి వనములో భామలు, చెలియకుంటలోన భామలు, చెలియకుంటలోన భామలు వోలలాడినారు...’
అంటూ గొల్లభామలు - కృష్ణుని పాటలు,
రాత్రి వచ్చిన సాంబశివుడు ఎంతటి మాయల వాడోయమ్మఅనే శివ మహత్యం తెలిపే పాటలు,
చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికేనమ్మా వాడలోన....’ అంటూ సాగే పాటపూన్నో పాడుకుంటరు.

అదే విధంగా గౌరిపూజ చేసి, గౌరమ్మ కళ్యాణం (పసుపు ముద్ద గౌరమ్మ) చేసి, గౌరిని అంటే బతుకమ్మను సాగనంపుతూ పాటలు పాడుకుంటరు. పండుగ వేళ చేసే ప్రతీ పని ఆట, పాట అన్నీ మానవ జీవితంలోని సన్నివేశాలను ముఖ్యంగా స్త్రీలు కోరుకునే పేరంటం, సౌభాగ్యాలను చిత్రిస్తయి.
వినవంతూ నింట్లో పుట్టి హిమవంతూ నింట్లో పెరిగి...’ అంటూ సాగే పాటలు స్త్రీల ఉద్దేశ్యాలను తేటతెల్లం చేస్త్తయి.
   వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ  

No comments:

Post a Comment