శ్రీ వైష్ణవానాం
శ్రీకృష్ణ జన్మాష్టమి
ఈ రోజు శ్రీకృష్ణ అవతారం
జరిగిన రోజు. శ్రీకృష్ణాష్టమి ఎప్పుడు
చేసుకోవాలి అనేదాని గురించి ఒక నిర్ణయం ఉంది.
సూర్యుడు సింహమాసంలో ఉండాలి, బహుల ఆష్టమి రోహిని
నక్షత్రం ఉండాలి. మొట్టమొదట స్వామి అవతరించినప్పటి గ్రహ స్థితి అది.
ప్రతి సంవత్సరం అన్నీ కలిసి అట్లానే
రావడం రాక పోవచ్చు, కానీ
అవతారం జరపాలి అంటే నక్షత్రాన్ని ప్రధానం
చేసుకొని చేయాలి. అసలు శ్రీకృష్ణ అవతారమే
ఒక రహస్యమైనది, అయ్యో కంసునికి తెలిస్తే
ఎలా అనేది భక్తుల భయం.
ఆండాళ్ తల్లి "ఒరుత్తి
మగనాయ్ పిఱందు " అనిచెబుతుంది. ఒక అద్వితీయమైన మహానుభావురాలికి
పుట్టావు. ఎవరికి పుట్టాడో ఆమే పేరుని చెప్పటం
లేదు, ఎందుకంటే అయ్యో కంసుడికి తెలిస్తే
ఎలా, కాలం గడిచి పోయినా
సరే కాలం యొక్క అడ్డుగోడలు
లేనివారు, స్వామిపై అంత ప్రేమ. అందుకే
ఏనాడు అని చేసుకున్నా ఆయనకి
చెల్లుబాటు అవుతుంది. అలాంటి స్వామికి రోహిని నక్షత్రం నాడు జరుపుకోవాలి. ముఖ్యంగా
ఏనాడు జరుపుకున్నా ఇబ్బంది లేదు, ఆయన అవతారం
ఎందుకు వచ్చింది తెలుసుకోవడమే ప్రధానం.
కణ్ణన్ తిరునక్షత్ర తనియన్
సింహమాసే సితే పక్షే రోహిణ్యామష్టమీ
తిథౌ |
చరమార్థ ప్రదాతారం కృష్ణం వన్దే జగద్గురుమ్ ||
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్థనం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ||
మనకు సులభమైన ఉపాయాన్ని చెప్పడానికి ఆయన అవతరించాల్సి వచ్చింది.
ఆయన చెప్పిన ఉపాయం.
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి
మా శుచః ||
నీకేమి బెంగ అవసరం లేదు,
నీవు నా శరీరంలో ఒక
భాగం, దానికి అంటిన మురికిని నేనే
తొలగించుకుంటా. మీలో ఉండే దోశాలన్ని
తొలగించి జ్ఞాన పరిమళాలు విరజిమ్మేట్టు
చేసి పొంగిపోయేవాడిని నేను ఉంటుంటే మీకెందుకు
బెంగ. సాధించాలని వేటి వెంట అయితే
పడి అవే సాధనాలు అని
అనుకుంటున్నారో అలాంటి వాటి యందు పట్టుని
వదిలి వేసుకోండి. మీరుచేసే భాద్యతలు, విధులు అన్ని నెరవేర్చుకోండి, అది
నా ఆరాధన అని భావించండి.
విధినిర్వహణ, భగవత్ భావన రెంటిని
కలిపి చేసినట్లయితే ఎవడైనా సరే తరించి తీరుతాడు.
తను అండగా ఉంటా అని
చెప్పాడు. లోకంలో ఆయన మాటకు అడ్డు
చెప్పేవారు లేరు. మనలాంటి వారు
ఇచ్చే మాటలని చెల్లుబాటు చేసుకోవాలంటే శ్రమ అవసరం, కానీ
ఆయన మాటను కాదనే మరొకరు
ఆయన వెనకాతల ఎవ్వరూ ఉండరు. ఆయనతో సాటి అయిన
వారు కానీ, ఆయన వెనకాతల
ఉండి నడిపేవారు కానీ ఎవ్వరూ లేరు.
అందుకే మనల్ని ఓదార్చడానికే వచ్చాడు స్వామి. ఎన్నో రకాలుగా, ఎన్నో
సందర్భాలలో వాస్తవాన్ని నిరూపించాడు. అయన పెద్ద అయ్యాక
చేప్పిన మాటల కంటే ఆయన
బాలుడిగా ఉన్నప్పడు చేసిన చేష్టలే మనకు
ఆనందంగా, ఆహ్లాదంగా, అనువైనట్లు అందుకునేలా ఉంటాయి. పెద్దయ్యాక ఎన్నో రక రకాల
రాజనీతులు, ఉపదేశాలు చేస్తాడు. కానీ చిన్నప్పుడు హాయిగా
ఆటలు ఆడుతాడు, పాటలు పాడుతాడు, చిందులు
వేస్తాడు, చిలిపి చేష్టలు చేస్తాడు, రకరకాల చేష్టల ద్వారా బాల లీలలు చేస్తూ
బ్రహ్మ తత్వాన్ని ఆవిష్కరించాడు. ఒక్కో లీల వెనక
బ్రహ్మ లీల ఉంది సుమా
అని రహస్యాన్ని గుర్తించిన పెద్దలు చెబుతారు. అసలు మేం ఈ
లోకాన్ని నమ్మము అని చెప్పే వారు
కూడా ఏమిటో ఆ శ్రీకృష్ణుడి
బాల లీలలు తలచుకుంటే ఏదో
ఒక మైకం కమ్మి అందులోంచి
పైకి లేవలేక పోతున్నాం అని అనుకున్న మహనీయులు
ఉన్నారు. ప్రపంచంలో అల్లరి చేసి హృదయాలు దోచుకున్న
ఏకైక అవతారం శ్రీకృష్ణ అవతారం. శ్రీరాముడు లోకం
ఏది మంచిది అని అనుకుంటుందో అట్లాంటి
పనులు చేసి, తన కళ్యాణ
గుణాలను చూపి అందరి హృదయాన్ని
దోచుకుంటే, కృష్ణుడు లోకం ఏది చెడ్డది
అని అనుకునే చేష్టలనే చేసి, వాటితోటి మరపురాకుండా
అందరి హృదయాలలో చోటుచేసుకొన్న ఏకకై చిలిపి అవతారం.
ప్రపంచంలోని అందరి ప్రేమను దోచుకున్న
అవతారం కృష్ణావతారం. ఎంత తెలుసుకున్న ఇంకా
తెలుసుకోవాలి అని అనిపిస్తుంది.
కృష్ణ పరమాత్మ అంటే అపరితమైన ఆనందం.
ఇంత అని కొలవడానికి అవకాశం
లేనిది. దేన్నైతే పొందాక ఇక మరొకటి కావాలని
అనిపించదో అదే అపరిమిత ఆనందం
అంటే. శ్రీమద్భాగవతంలో "దేవకీ పూర్వ సంధ్యాయాం
అవిర్భూతం మహాత్మనం" అని చెబుతారు. పరమాత్మ
దేవకీదేవికి పుట్టాడు అని చెబుతారు. ఆయన
అవతరించాడు అని చెప్పరు, అవతరించాడు
అంటే ఆయన ఎక్కడి నుండో
దిగి రావడం. నేను పుడతాను అని
మాట ఇచ్చాడు దేవకీదేవికి. ఆయన తన మాటకే
కాదు తన భక్తుల మాటని
కూడా తప్పు కానివ్వడు. నృసింహ
అవతారం వచ్చింది ప్రహ్లాదుని మాటని నిజం చేయడానికే
కదా. అట్లా పుట్టాడు స్వామి.
ఆయన పుట్టగానే ఎట్లా ఉన్నాడు అని
సేవించిన వసుదేవుని మాట, ఆయన అవతారాన్ని
వర్ణించిన వ్యాసుని మాట "తమద్భుతం బాలకం". ఇతను పరమాత్మే అని
గుర్తించడానికి పుండరీకాక్షుడై, నాలుడు భుజములు కలిగి, శంఖచక్రగద ధారియై, వక్షస్థలంపై శ్రీవత్స చిహ్నం కలిగి, కౌస్తుభమణి ధరించి ఉన్నాడు. అట్లాంటి స్వామిని వసుదేవుడు చూసాడు. కారాగారంలో అర్దరాత్రి దేవకీ వసుదేవులకు పుట్టాడు.
కంసునికి తెలిస్తే ఏం చేస్తాడో అని
దేవకీదేవి చేసిన ప్రార్థనకి తన
రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. మోక్షాన్ని ప్రసాదించడానికి వచ్చిన అవతరం శ్రీకృష్ణ అవతారం.
అనంత కోటి బ్రహ్మాండములని తన
పొట్టలో దాచుకున్న స్వామిని మనం కట్టి వేయగలామా!
కానీ ఆయన యశోదమ్మ ప్రేమకు
కట్టించుకొని తన సౌశీల్యాన్ని చూపించాడు.
అట్లాంటి స్వామిని మనం సేవించుకోగలిగే అవకాశం
స్వామి మనకు ప్రసాదించడమే మన
అదృష్టం.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్
అర్బన్ శాఖ
No comments:
Post a Comment