Monday, 18 April 2016

మహావీర్ జయంతి

http://www.vipravanam.com/
అహింసను ప్రభోధించిన జైన మత ప్రచారకుడు , వర్ధమాన మహావీరుడి జయంతి ని ప్రతిసంవత్సరము చైత్ర మాసంలో ఘనముగా జరుపుకుంటారు . బీహార్ లో వైశాలి కి సమీపములో కుండ గ్రామము లో క్రీ.పూ. 599 లో క్షత్రియ కుటుంబములో సిద్దార్ధ మహారాజుకు , రాణి త్రిష లకు జన్మించిన మహావీరుడికి తల్లి దండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు . అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడు తల్లి దండ్రులు 28 ఏట మరణించారు , యశోధరను వివాహమాడి , కుమార్తెకు జన్మనిచ్చిన తరువాత 36 ఏట సన్యాసాన్ని స్వీకరించిన వర్ధమానుడు . 12 ఏళ్ళ పాటు తపస్సు చేసి మహావీరుడు గా జైనమత ప్రచారకుడయ్యాడు . అప్పటి కే జైన మతానికి 23 మంది తీర్ధంకరులుగా ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాతే మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి . 32ఏళ్ళ పాటు అహింసా ధర్మము తో మాట ప్రచారం జరిపిన మహావీరుడు 72 ఏట మరణించారు .
వల్లూరి పవన్ కుమార్                        
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ


అనంగ త్రయోదశి

http://www.vipravanam.com/
     భారతీయ సంస్కృతీ సంప్రదాయాలెంతో విశిష్టమైనవి. ప్రపంచ దేశాలకే ఆదర్శమైనవి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రముఖ స్థానం ఉంది. భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసి హాయిగా జీవించేందుకు ఎన్నోవ్రతాలు, నోములు, పూజలున్నాయి. ఇవి అనాదిగా ఆచరింపబడుతూ దాంపత్య జీవనాన్ని పటిష్ఠంగానూ, సుఖ మయంగా గడపేందుకు ఎంతో దోహదపడుతున్నాయి.
      చైత్రమాసంలో వచ్చే అనంగత్రయోదశి రోజు శివుణ్ని పూజిస్తే సంవత్సరంలో ప్రతి రోజూ శివుడిని పూజించిన ఫలం లబిస్తుందని శాస్త్ర వచనం. అదేవిధంగా రోజు మన్మధుని పూజిస్తే భార్యభర్తల మధ్య అన్యోన్యత వృద్ధి చెందుతుంది.
      భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి, దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- 'అనంగత్రయోదశీ వ్రతం'. వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.
      అనంగుడు అంటే 'మన్మధుడు' అని అర్థం. మన్మధుడు బ్రహ్మచేత, శివుని చేత అనంగు నిగా (అదృశ్యునిగా) చేయబడినట్లు పురాణ కథలు మనకు చెబుతున్నాయి.
     మన్మథుని వాహనం చిలుక. అరవిందాది పుష్పాలు అతని బాణాలు. అతడు ప్రేమాధి దేవత. మంచిరూపం కలవాడు.
తారకాసురుడనే రాక్షసుడు వరగర్వంతో సకలలోకాల్ని కష్టాలపాలు చేయసాగాడు. దీనితో వాణ్నలా చంపాలని దేవతలంతా రకరకాల ఆలోచనలుచేసి, చివరకు బ్రహ్మదేవుడి సలహా తీసుకుంటారు.
      అందుకు శివుడి కుమారుడే తారకాసురుణ్ని అంతమొందిస్తాడని సమాధానమిస్తాడు బ్రహ్మ. అప్పటికి శివుడు తపస్సులో ఉండటంతో, శివుడు తపస్సు మాని పార్వతీ దేవిని వివాహం చేసుకునేలా బాధ్యతను ఇంద్రుడు మన్మధుడికి అప్పగించాడు.
      దీంతో మన్మథుడు తన బాణాన్ని శివుడిపై ప్రయోగించాడు. శివుడి మనస్సు చలించింది. తన మనస్సుకు చలింప చేసింది ఎవరు? అని శివుడు మూడవ కన్ను తెరవడంతో మన్మథుడు భస్మమై 'అనంగుడయ్యాడు'. విషయం తెలిసి రతీదేవి విలపించి, శివుడిని ప్రార్థించింది. దీంతో శివుడు మన్మథుడిని బ్రతికించి కేవలం రతీదేవికి మాత్రమే కనిపించేటట్లు వరం ప్రసాదించాడు.
     ఆ విధంగా వరం ప్రసాదించిన దినమే 'అనంగ'త్రయోదశి. గంగాసరయూ నదీ సంగమ ప్రాంతం ఒకప్పుడు అంగదేశంగా మన్మథుడి పేర ప్రసిద్ధిగాంచింది. ఈరోజూ పరమేశ్వరునితో పాటు రతీమన్మథులను పూజిస్తే అన్యోన్యమైన దాంపత్యసిద్ధి కలుగుతుందని ధర్మసింధు కూడా స్పష్టీకరిస్తోంది.

అనంగ గాయత్రి జపంకామదేవాయ విద్మహే| పుష్పబాణాయ ధీమహి| తన్నో అనంగ ప్రచోదయాత్‌||
అనే అనంగ గాయత్రీని స్మరించుకుంటూ రతీమన్మథులను పూజించాలి. భారతీయులు గృహస్థాశ్రమానికి కూడా అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. అది మిగతా బ్రహ్మచర్యాది ఆశ్రమాలకు ఆధారశిల. అందుకే దాంపత్య అన్యోన్యతను పెంచేందుకు అనంగవ్రతాది పూజలను ఏర్పరచారు. కామదేవుడన్నా, అనంగుడన్నా, పుష్పబాణుడన్నా ఇవన్నీ మన్మథునికి పేర్లే. అయితే, కామ మరింత ప్రకోపించకుండా కామారి అయిన మహాదేవుణ్ని కూడా పూజించాలి. సకల ఐశ్వర్య, ఆనంద ప్రధాన సర్వేశ్వరుడే కదా!
వల్లూరి పవన్ కుమార్  
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ   


Sunday, 10 April 2016

లక్ష్మీ పంచమి ప్రత్యేకత(చైత్రశుద్ధ పంచమి)

http://www.vipravanam.com/
ఆర్ధికపరమైన బలం ఆనందాన్నిస్తుంది ... అవసరాలు తీర్చుకోగలం, ఆపదల నుంచి గట్టెక్కగలం అనే ధైర్యాన్నిస్తుంది. కారణంగానే అందరూ కూడా సంపదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సంపదలను పెంచుకోవడానికి ఎంతగానో కష్టపడుతుంటారు. అయితే విషయంలో ఎవరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి. లక్ష్మీదేవి చల్లనిచూపు సోకితే సిరిసంపదలతో తులతూగడానికి ఎంతో సమయం పట్టదు.

అలాంటి లక్ష్మీదేవిని 'చైత్రశుద్ధ పంచమి' రోజున పూజించాలని శాస్త్రం చెబుతోంది. రోజు ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పూజామందిరాన్ని వివిధ రకాల పూలమాలికలతో అలంకరించాలి. లక్ష్మీదేవి ప్రతిమకు పంచామృతాలతో అభిషేకం జరపాలి. దమనములతో అమ్మవారిని అర్చిస్తూ, ఆమెకి ఎంతో ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

విధమైన నియమనిష్ఠలతో పూజించడం వలన దారిద్ర్యం నశించి సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే రోజున నాగదేవతను కూడా ఆరాధించాలని శాస్త్రం చెబుతోంది. రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నాగప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహించి పాలను నైవేద్యంగా సమర్పించాలి.

సాధారణంగా కొందరిని నాగదోషాలు వెంటాడుతూ ఉంటాయి. ఫలితంగా ప్రతి విషయంలోనూ ఎన్నో ఉబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అందుకు కారణం నాగదోషం అనే విషయం కూడా చాలామందికి తెలియదు. నానారకాల సమస్యలతో సతమతమైపోతున్న వాళ్లు రోజున నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.

 వల్లూరి పవన్ కుమార్  
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ


Thursday, 7 April 2016

చైత్ర మాసం

http://www.vipravanam.com/  వ్రతాల మాసం చైత్రం
సంప్రదాయబద్ధంగా మనకున్న పన్నెండు మాసాల్లో తొలి మాసం చైత్రమాసం. వసంత రుతువు ఆగమనంతో ప్రకృతి సౌందర్యం మాసంలో అలరారుతుంటుంది. పలువురు దేవతలకు సంబంధించిన వ్రతాలు, పూజలతో ప్రజలలో భక్తి భావం పరిఢవిల్లుతూ ఉంటుంది. దశావతారాలలోని వరాహ, రామ, మత్సా్యవతారాల జయంతులు మాసంలోనే వస్తాయి. అన్నిటినీ మించి చైత్రం తొలి రోజు శుద్ధ పాడ్యమినాడు ఉగాది పర్వదినాన్ని జరుపుకొంటారు అంతా. చైత్రసోయగానికి చిహ్నంగా కనిపించే పరిమళభరితమైన దమన పత్రాలతో నెలలోని మొదటి పదిహేను రోజులు అనేక మంది దేవతలకు పూజలు చేయటం ఆచారంగా ఉంది. తొలి రోజు సృష్టికర్త, చతుర్ముఖుడు అయిన బ్రహ్మకు దమన పత్రాలతో పూజ చేస్తారు. మరునాడు విదియనాడు ఉమ శివ అగ్నులకు, తదియనాడు గౌరీ శంకరులకు, చతుర్దినాడు గణపతికి, పంచమినాడు నాగులకు, షష్ఠి నాడు కుమారస్వామికి, సప్తమినాడు సూర్యుడికి దమన పత్రాలతో పూజ చేస్తారు. అష్టమినాడు మాతృ దేవతలకు, నవమినాడు మహిషాసుర మర్దనికి, దశమినాడు ధర్మరాజుకు, ఏకాదశినాడు మునులకు, ద్వాదశినాడు మహావిష్ణువుకు, త్రయోదశినాడు కామదేవుడికి, చతుర్దశినాడు శంకరుడికి, పూర్ణిమనాడు శనికి, ఇంద్రుడికి దమన పత్రాలతో పూజలు చేయాలని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇలా చెయ్యటం సర్వశుభప్రదం అని పెద్దలు వివరిస్తున్నారు. చైత్రశుద్ధ విదియనాడు నేత్ర ద్వితీయ, ప్రకృతి పురుష ద్వితీయ వ్రతాలు చేస్తారు. ఉమ, శివ, అగ్నులకు పూజ జరుగుతుంది. మరి కొంతమంది అరుంధతి వ్రతం చేస్తారు. చైత్ర శుద్ధ తదియనాడు శివడోలోత్సవం, సౌభాగ్య వ్రతం జరుపుతారు. చవితినాడు గణేశపూజ, పంచమినాడు శాలిహోత్రహయ పంచమి నిర్వహిస్తుంటారు. గుర్రాలకు పూజ చేయటం పంచమినాటి విశిష్టత. శ్రీవ్రతం పేరున ఇదే రోజు లక్ష్మీనారాయణులను పూజిస్తారు. శ్రీరామ రాజ్యోత్సవం జరుపుతారు. దీంతో పాటు పంచమూర్తి వ్రతం, సంవత్సర వ్రతం, పంచమహభూత వ్రతం, నాగపూజ తదితరాలు చెయ్యటం ఉంది. షష్ఠినాడు కుమార షష్ఠి వ్రతం చేస్తుంటారు. శుద్ధ సప్తమి తిథి నాడు సూర్యసంబంధమైన వ్రతాలు జరపటం కనిపిస్తుంది. అష్టమినాడు అశోకాష్టమి, అశోక రుద్రపూజ, భవానీ అష్టమి జరుపుతారు. శుద్ధ నవమికి మరింత విశిష్టత ఉంది. ఇదే రోజు శ్రీరామ నవమి పర్వదినం జరుగుతుంది. దశమినాడు ధర్మరాజ దశమి, శాలివాహన జయంతి చెయ్యడం ఉంది. చైత్ర శుద్ధ ఏకాదశినాడు ఏకాదశీవ్రతాన్ని ఆచరిస్తుంటారు. రోజునే కామదైకాదశిని జరపటం కనిపిస్తుంది. ప్రత్యేకంగా స్త్రీలు తమ కోర్కెలను సిద్ధింపచేసుకోవటానికి వ్రతాన్ని చేస్తుంటారు. శుద్ధ ద్వాదశినాడు వాసుదేవార్చన, లక్ష్మీనారాయణ పూజ జరుగుతాయి. త్రయోదశినాడు అనంగత్రయోదశీ వ్రతం లేక మదన త్రయోదశీ వ్రతం జరుపుతారు. శుద్ధ చతుర్దశినాడు శైవచతుర్దశి కర్దమ క్రీడలాంటివి జరుగుతాయి. చైత్ర పూర్ణిమనాడు మహాచైత్ర వ్రతం జరుపుతారు. దీంతోపాటు చిత్రగుప్త వ్రతం లాంటివి ఉంటాయి. ఇప్పటికి మాసంలో సగభాగం అయిపోయినట్టవుతుంది. చైత్ర బహుళ పాడ్యమి నాడు జ్ఞానావాప్తి వ్రతం, పాతాళ వ్రతం ఉంటాయి. తర్వాత బహుళ పంచమి నాడు మత్స్య జయంతి, ఏకాదశినాడు వరూధిని ఏకాదశి, త్రమోదశినాడు వరాహ జయంతి జరుపుతుంటారు. చైత్ర బహుళ చతుర్దశినాడు గంగానది స్నానం చేయటం వల్ల పాపాలు నశిస్తాయి. బహుళ అమావాస్యనాడు పరశురాముడి పూజలు చేస్తుంటారు. ఇలా పలు వ్రతగ్రంథాలు చైత్ర మాసంలో వచ్చే పుణ్యప్రదాలైన అనేక వ్రతాల గురించి వివరించి చెబుతున్నాయి.
    వల్లూరి పవన్ కుమార్

- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ


శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

  ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
 శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ."ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు.
ఉగాది రోజు
తైలాభ్యంగం సంకల్పాదవు నూతన వత్సర నామకీర్త నాద్యారంభం...
ప్రతిగృహం ధ్వజారోహణం, నింబపత్రాశనం వత్సరాది ఫలశ్రవణం...
    తైలాభ్యంగనం
    నూతన సంవత్సరాది స్తోత్రం
    నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం)
    ధ్వజారోహణం (పూర్ణకుంభదానం)
    పంచాంగ శ్రవణం
మున్నగు 'పంచకృత్య నిర్వహణ' గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగుపంచకృత్య నిర్వహణ’  గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ, ముఖ్యమయిన పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం.
పంచాంగ శ్రవణం: ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. పంచాంగ శ్రవణం వళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది. మనకు తెలుగు సంవత్సరాలుప్రభవతో మొదలుపెట్టిఅక్షయనామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించిషష్టిపూర్తిఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు. పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
కవి సమ్మేళనం:
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది
    వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ