Thursday, 12 November 2015

కార్తీక మాసం 30వ అధ్యాయం : ఫలశ్రుతి

కార్తీక మాసం 30 అధ్యాయం : ఫలశ్రుతి

నైమిశారణ్య ఆశ్రమంలో శౌనకాది మహామునులందరికీ సూతమహర్షి కార్తీక వ్రత మహిమా ఫల శ్రుతిని తెలియజేశారు. విష్ణు మహిమ, విష్ణు భక్తుల చరిత్రలను విని అంతా ఆనందించారు. వేయినోళ్ల సూతమహర్షిని కొనియాడారు. శౌనకాది మహామునులకు ఇంకా సంశయాలు తీరకపోవడంతో సూత మహర్షిని చూసి మహాముని! కలియుగంలో ప్రజలు అరిషడ్వర్గాలకు దాసులై, అత్యాచారపరులై జీవిస్తున్నారు. సంసార సాగరంలో తరించలేకపోతున్నారు. అలాంటి వారికి సులభంగా ఆచరించే వ్రతాలేమైనా ఉన్నాయా? ఉంటే మాకు వివరించండి. ధర్మాలన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించే ఉత్తమ ధర్మమేదో సెలవివ్వండి. దేవతలందరిలో ముక్తిని కలిగించే దైవం ఎవరో చెప్పండి. మానవుడిని ఆవరించిన అజ్ఞానాన్ని రూపుమాపి, పుణ్యఫలమిచ్చే కార్యమేమిటో తెలపండి. ప్రతిక్షణం మృత్యువు వెంటాడుతున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయమేమిటి? హరినామస్మరణ సర్వదా చేస్తున్నామేము సంశయాల్లో కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి మాకు వివరించి, మమ్మల్ని ఉద్దరించండిఅని కోరారు.
దానికి సూత మహర్షి ఇలా చెబుతున్నారు… ” మునులారా! మీకు కలిగిన సంశయాలు తప్పక తీర్చుకోవాల్సినవే. కలియుగంలో మానవులు మందబుద్ధులు. క్షణికములైన సుఖాలతో నిండిన సంసార సాగరం దాటేందుకు మీరు అడిగిన ప్రశ్నలు దోహదపడతాయి. మోక్షసాధనలుగా ఉంటాయి. కార్తీక వ్రతం వల్ల యాగాది క్రతువులు చేసిన పుణ్యం, దాన ధర్మ ఫలాలు చేకూరుతాయి. కార్తీక వ్రతం శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన వ్రతం. ఇది అన్ని వ్రతాల కంటే ఘనమైనదని శ్రీహరే సెలవిచ్చారు. వ్రత మహిమ వర్ణించడానికి నాకు శక్తి సరిపోదు. అంతేకాదు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి కూడా శక్యం కాదు. అయినాసూక్షంగా వివరిస్తాను. కార్తీకమాసంలో పాటించాల్సిన పద్ధతులను గురించి చెబుతాను. శ్రద్ధగా వినండి. కార్తీకమాసంలో సూర్యభగవానుడు తులారాశిలో ఉనప్పుడు శ్రీహరి ప్రీతికోసం మనకు ముక్తి కలగడానికి తప్పనిసరిగా నదీస్నానం ఆచరించాలి. దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజించాలి. తనకున్న దాంట్లో కొంచెమైనా దీపదానం చేయాలి. నెలరోజులు విధవ వండిన పదార్థాలు తినరాదు. రాత్రులు విష్ణువాలయాల్లోగానీ, శివాలయాల్లోగానీ ఆవునేతితో దీపారాధన చేయాలి. ప్రతిరోజు సాయంకాలం పురాణ పఠనం చేయాలి. విధంగా చేయడం వల్ల సకల పాపాల నుంచి విముక్తులై సర్వ సౌక్యాలను అనుభవిస్తారు. సూర్యుడు తులారాశిలో ఉన్న నెలరోజులు విధంగా పద్ధతులు పాటించేవారు జీవన్ముక్తులవుతారు. ఇలా ఆచరించే శక్తి ఉన్నా.. ఆచరించక పోయినాభక్తి శ్రద్ధలతో కార్తీక నియమాలను పాటించేవారిని ఎగతాళి చేసినాధన సహాయం చేసేవారికి అడ్డుపడినావారు ఇహలోకంలో అనేక కష్టాలను అనుభవించడమేకాకుండా…. వారి జన్మాంతరంలో నరకంలోపడి కింకరులచే నానా హింసలపాలవుతారు. అంతేకాకుండావారు నూరు హీనజన్మలెత్తుతారు.
కార్తీకమాసంలో కావేరీ, గంగా, అఖండ గౌతమి నదుల్లో స్నానం చేసి, ముందు చెప్పిన విధంగా నిష్టతో కార్తీక నియమాల్ని పాటించేవారు జన్మాంతరాన వైకుంఠ వాసులవతుతారు. సంవత్సరంలో వచ్చే అని నెలల్లో కార్తీక మాసం ఉత్తమమైనది. అధిక ఫలదాయకమైనది. హరిహరాదులకు ప్రీతికరమైనది కాబట్టి కార్తీక మాస వ్రతం వల్ల జన్మజన్మల నుంచి వారికున్న సకల పాపాలు తొలగిపోతాయి. నియమ నిష్టలతో కార్తీక వ్రతం ఆచరించేవారు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇలా నెలరోజులు నియమాలు పాటించలేనివారు కార్తీక శుద్ధ పౌర్ణమినాడు తమ శక్తికొలదీ వ్రతమాచరించి, పురాణ శ్రవణం చేసి, జాగారం ఉండి…. మర్నాడు ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితేనెలరోజులు వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. నెలలో ధనం, ధాన్యం, బంగారం, గృహం, కన్యాదానం చేసినట్లయితేఎన్నటికీ తరగని పుణఫ్యం లభిస్తుంది. నెలరోజులు ధనవంతుడైనా, పేద అయినా.. మరెవ్వరైనా హరినామ స్మరణను నిరంతరం చేయాలి. పురాణాలు వింటూ, పుణ్యతీర్థాలను సేవిస్తూ దాన ధర్మాలుచేయాలి. అలా చేసేవారు పుణ్యలోకాలను పొందుతారు. కథను చదివినవారికి శ్రీమన్నారాయణుడు సకలైశ్వర్యాలను ఇచ్చి, వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాడు.
ఇతి శ్రీ స్కాంధ పురాణాంతర్గత వశిష్ట సంప్రోక్త కార్తీక మహత్యమందలి త్రింశోధ్యాయం సమాప్తం
ముప్ఫైయవరోజు (ఆఖరి రోజు) పారాయణం సమాప్తం
ఓం సర్వేషాం స్వస్తి ర్భ వతు ఓం సర్వేషాం శాంతి ర్భ వతు
ఓం సర్వేషాం పూర్ణం భవతు ఓం శ్శాంతి శ్శాంతి::||
కార్తీకపురాణం – 30 అధ్యాయం : ఫలశ్రుతి
    వల్లూరి పవన్ కుమార్                         
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ




కార్తీకపురాణం 29వ అధ్యాయం : అంబరీషుడు దుర్వాసుని పూజించుట

కార్తీకపురాణం 29వ అధ్యాయం : అంబరీషుడు దుర్వాసుని పూజించుట

అత్రి మహర్షి అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు… ”ఈ విధంగా సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి, ఇద్దరినీ రక్షించి, భక్తకోటికి దర్శనమిచ్చి అంర్థానమైంది” అని ఇలా చెప్పసాగాడు…
ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసుడి పాదాలపై పడి దండప్రణామాలు ఆచరించాడు. పాదాలను కడిగి, ఆ నీటిని తన తలపై చల్లుకుని ఇలా చెబుతున్నాడు… ”ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్తుడిని. నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తాను. ద్వాదశీ వ్రతం జేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఆపదా వాటిల్లకుండా ధర్మవర్తుడనై రాజ్యాన్ని పాలిస్తున్నాను. నా వల్ల మీకు సంభవించిన కష్టానికి నన్ను క్షమించండి. మీ యందు నాకు అమితమైన అనురాగముండడం వల్ల మీకు ఆతిథ్యమివ్వాలని ఆహ్వానించాను. కాబట్టి, నా ఆతిథ్యాన్ని స్వీకరించండి. నన్ను, నా వంశాన్ని పావనం చేయండి. మీరు దయార్ద్ర హృదయులు. ప్రథమ కోపంతో నన్ను శపించినా.. మరలా నా గృహానికి వచ్చారు. నేను ధన్యుడనయ్యాను. మీ రాక వల్ల శ్రీమహావిష్ణువు సుదర్శన చక్ర దర్శన భాగ్యం కలిగింది. అందుకు నేను మీ ఉపకారాన్ని మరవలేను. ఓ మహానుభావా! నా మనస్సెంతో సంతోషంగా ఉంది. అసలు మిమ్మల్ని ఎలా స్తుతించాలో కూడా పలుకులు రావడం లేదు. నా కంటివెంట ఆనంద బాష్పాలు వస్తున్నాయి. వాటితో మీ పాదాలను కడుగుతున్నాను. మీకు ఎంత సేవ చేసినా… ఇంకనూ మీకు రుణపడి ఉంటాను. కాబట్టి ఓ పుణ్య పురుషా! నాకు మరలా జన్మ అనేది లేకుండా… జన్మరాహిత్యం కలిగేట్లు, సదా మీ వంటి మునిశ్రేష్టులు, ఆ శ్రీమన్నారాయణుడి యందు మనస్సు గలవాడనయ్యేలా నన్ను ఆశీర్వదించండి” అని ప్రార్థించాడు. అనంతరం సహపంక్తి భోజనానికి రమ్మని ఆయన్ను ఆహ్వానించారు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని దుర్వాసుడు ఆశీర్వదించి… ”రాజా! ఎవరు ఎదుటివారి బాధను నివారించి, ప్రాణాలను కాపాడుతారో… ఎవరు శత్రువులకైనా శక్తి కొలది ఉపకారం చేస్తారో… అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి, నీవు నాకు ఎంతో ఇష్టుడవు, తండ్రి సమానుడవయ్యావు. నేను నీకు నమస్కరించినచో నా కంటే చిన్నవాడగుట వల్ల నీకు ఆయుక్షీణమగును. అందుకే నీకు నమస్కరించడం లేదు. నీవు కోరిన ఈ కోరిక స్వల్పమైనదే. తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశినాడు వ్రత నిష్టతో ఉండే నీకు మనస్థాపం కలుగజేసినందుకు వెంటనే నేను తగు ప్రాయశ్చిత్తం అనుభవించాను. నాకు సంభవించిన విపత్తును తొలగించేందుకు నీవే దిక్కయ్యావు. నీతో భోజనం చేయడం నా భాగ్యం” అన్నారు. ఆ తర్వాత అంతా కలిసి, పంచభక్ష్య పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించారు. దుర్వాసుడు అతని భక్తిని ప్రశంసించి, అనంతరం దీవించి, తన ఆశ్రమానికి తిరిగి వెళ్లిపోయారు.
తిరిగి అత్రి మహాముని అగస్త్యులవారితో ఇలా చెబుతున్నారు…. ”ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశిరోజున జరిగింది. ద్వాదశి వ్రత ప్రభావమెంతటి మహత్తుగలదో గ్రహించావా? ఆ దినాన విష్ణుమూర్తి క్షీర సాగరంలో శేష శయ్యపైనుంచి లేస్తారు. ఆ రోజు ప్రసన్న మనస్కుడై చేసిన పుణ్యం, ఇతర దినాలలో పంచదానాలు చేసినంత ఫలితంతో సమానం. ఎవరైనా కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి… పగలంతా హరినామ కీర్తనతో గడిపి, రాత్రి పురాణం చదువుతూ, లేదా వింటూ… జాగరణ చేసి, ఆ తర్వాతిరోజు అయిన ద్వాదశినాడు తన శక్తికొద్దీ శ్రీమన్నారాయణుడిని ధ్యానించి, ఆ శ్రీహరి ప్రీతికోసం దానాలిచ్చి, బ్రాహ్మలతో కలిసి భోజనం చేయాలి. అలా చేసేవారి సర్వపాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. ద్వాదశి శ్రీమన్నారాయణుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. కాబట్టి, ఆ రోజు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉన్నా… ఆ ఘడియలు దాటకుండానే భోజనం చేయాలి. ఎవరికైతే వైకుంఠంలో స్థిరనివాసమేర్పరుచుకోవాలని కోరిక ఉంటుందో… వారు ఏకాదశి వ్రతం, ద్వాదశి వ్రతం చేయాలి. ఏ ఒక్కటీ విడువ కూడదు. శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్నివిధాలా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎంత మాత్రం సంశయించాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది. అయినా… అదే గొప్ప వృక్షం అవుతుంది. అదేవిధంగా కార్తీకమాసంలో నియమానుసారంగా చేసే కొంచెం పుణ్యమైనా… అది అవసాన కాలమందు యమదూతల నుంచి కాపాడుతుంది. అందుకే.. ఈ కార్తీక మాస వ్రతం చేసి, దేవతలే కకుండా, సమస్త మానవులు తరించారు. ఈ కథను ఎవరు చదివినా… విన్నా… సకలైశ్వర్యాలు సిద్ధించి, ధన ప్రాప్తి కలుగుతుందని అత్రిమహర్షి సెలవిచ్చారు.
ఇతి శ్రీ స్కాందపురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమందలి ఏకోనత్రింశోధ్యాయం సమాప్తం
ఇరవై తొమ్మిదో రోజు పారాయణం సమాప్తం
కార్తీకపురాణం – 29వ అధ్యాయం : అంబరీషుడు దుర్వాసుని పూజించుట
    వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ



కార్తీకపురాణం 28వ అధ్యాయం : విష్ణు సుదర్శన చక్ర మహిమ

కార్తీకపురాణం 28 అధ్యాయం : విష్ణు సుదర్శన చక్ర మహిమ

వశిష్టుల వారు జనక మహారాజుతో తిరిగి ఇలా అంటున్నారు… ” జనక మహారాజా! విన్నావా? దుర్వాసుడి అవస్థలు! తాను ఎంతటి కోపవంతుడైనావెనకా ముందు ఆలోచించకుండా మహాభక్తుని శుద్ధని శంకించాడు. కాబట్టి ప్రయాసలపాలయ్యాడు. ఎంత గొప్పవారైనాఆచరించు కార్యక్రమాలు జాగ్రత్తగా తెలుసుకోవాలిఅని చెబుతూఅత్రి మహర్షి అగస్త్యునికి చెప్పిన వృత్తాంతాన్ని తిరిగి వివరిస్తున్నాడు
అలా దుర్వాసుడు శ్రీమన్నారాయణుడి వద్ద సెలవు తీసుకుని, తనను వెన్నంటి తరుముతున్న సుదర్శన చక్రాన్ని చూసి, భయపడుతూ తిరిగి భూలోకానికి చేరుకుని, అంబరీషుడి వద్దకు పోయి… ” అంబరీషా! ధర్మపాలకా! నా తప్పును క్షమించి, నన్ను రక్షింపుము. నీకు నాపై ఉన్న అనురాగంతో ద్వాదశిపారాయణానికి నన్ను ఆహ్వానించావు. అయితే నేను నిన్ను కష్టాలపాలు చేశాను. వ్రతభంగం చేయించి, నీ పుణ్యఫలాన్ని నాశనం చేయాలనుకున్నా. కానీ, నా దుర్భుద్ధి నన్నే వెంటాడి, నా ప్రాణాలను తీయడానికి సిద్ధపడింది. నేను విష్ణువు వద్దకు వెళ్లి సుదర్శనం నుంచి కాపాడ మని ప్రార్థించాను. పురాణపురుషుడు నాకు జ్ఞానోదయం చేసి, నీ వద్దకు వెళ్లమని చెప్పాడు. కాబట్టి నీవే నాకు శరణ్యం. నేను ఎంతటి తపశ్శాలినైనాఎంతటి నిష్టావంతుడనైనానీ నిష్కళంక భక్తి ముందు సరిపోలను. నన్ను విపత్తు నుంచి కాపాడుఅని అనేక విధాలుగా ప్రార్థించాడు. అంబరీషుడు శ్రీమన్నారాయణుడిని ధ్యానించి… ” సుదర్శన చక్రమా! నీకివే నా నమస్కారాలు. దుర్వాస మహాముని తెలిసో, తెలియకో తొందరపాటుగా కష్టాలను కొని తెచ్చుకున్నాడు. అయినా ఇతడు బ్రాహ్మణుడు. కాబట్టి, ఇతన్ని చంపకు. ఒకవేళ నీ కర్తవ్యాన్ని నిర్వహించక తప్పదనుకుంటేముందు నన్ను చంపి తర్వాత దుర్వాసుడిని చంపు. శ్రీమన్నారాయణుడి ఆయుధానివి నీవు. నేను శ్రీహరి భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు. దైవం. నీవు శ్రీహరి చేతిలో ఉండి అనేక యుద్ధాల్లో అనేక మంది లోక కంటకులను చంపావు. కానీ, శరణు కోరేవారిని ఇంతవరకు చంపలేదు. అందుకేదుర్వాసుడు ముల్లోకాలు తిరిగినాఇతన్ని వెంటాడుతూనే ఉన్నావు. కానీ, చంపలేదు. దేవా! సురాసురాది భూతకోటి ఒక్కటిగా ఏకమైనానిన్నేమీ చేయజాలవు. నీ శక్తికి విధమైనా అడ్డు లేదు. విషయం లోకమంతటికీ తెలుసు. అయినామునిపుంగవుడికి అపాయం కలుగకుండా రక్షింపుము. నీయందు శ్రీమన్నారాయణుడి శక్తి ఇమ ఇమిడి ఉంది. శరణు వేడిన దుర్వాసుడిని రక్షింపుమని నిన్ను వేడుతున్నానుఅని అనేక విధాలుగా స్తుతించాడు. అప్పటి వరకు అతి రౌద్రంతో నిప్పులు కక్కుతున్న విష్ణుచక్రం అంబరీషుడి ప్రార్థనకు శాంతించింది. ” భక్తాగ్రేసరాఅంబరీషా! నీ భక్తిని పరీక్షించడానికి ఇలా చేశానేతప్ప మరొకందుకు కాదు. అత్యంత దుర్మార్గులు, మహాపరాక్రమవంతులైన మధుకైటభులను, దేవతలంతా ఏకమైనా చంపలేని మూర్ఖులను నేను దునిమాడటం నీకు తెలుసుకదా? లోకంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు శ్రీహరి నన్ను వినియోగించి, ముల్లోకాల్లో ధర్మాన్ని స్థాపిస్తున్నాడు. ఇది అందరికీ తెలిసిన విషయమేముక్కోపి అయిన దుర్వాసుడు నీపై పగపట్టి, నీ వ్రతాన్ని భంగపరిచి, నశింపజేసి, నానా ఇక్కట్లు పెట్టడం, కన్నులెర్రచేసి నీ మీద చూపిన రౌద్రాన్ని నేను గమనించాను. నిరపరాధివైన నిన్ను రక్షించి, ముని గర్వం అణచాలని తరుముతున్నాను. ఇతనూ సామాన్యుడు కాదు. రుద్రాంశం సంభూతుడు. బ్రహ్మతేజస్సు గలవాడు. మహా తపశ్శాలి. రుద్రతేజంతో భూలోకవాసులను చంపగల శక్తి ఆయనకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర తేజస్సు కలవాడు. వారుగానీ, నేనుగానీ, క్షత్రియ తేజస్సున్న నీవుగానీ, ఆయన ముందు సరితూగలేం. అయితేతనకన్నా ఎక్కువ శక్తివంతులతో సంధిచేసుకోవడం ఉత్తమం. నీతిని ఆచరించు వారు ఎలాంటి విపత్తుల నుంచి అయినా తప్పించుకోగలరు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి, శరణార్థిగా వచ్చిన దుర్వాసుడిని గౌరవించి, నీ ధర్మం నీవు నిర్వర్తించుఅని సుదర్శనుడు పలికాడు.
మాటలకు అంబరీషుడు… ”నేను దేవ, గో, బ్రాహ్మణాదుల పట్ల, స్త్రీలపట్ల గౌరవభావంతో మెసలుకుంటాను. నా రాజ్యంలో సర్వజనులూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటాను. కాబట్టి శరణు కోరిన దుర్వాసుడిని, నన్ను రక్షించు. వేల అగ్నిదేవతలు, కోట్ల సూర్యమండలాలు ఏకమైనానీ శక్తికి, తేజస్సుకు సాటిరావు. నీవు అసమాన్య తేజోరాశివి. మహావిష్ణువు నీన్ను విశేష కార్యాలకు వినియోగిస్తాడు. లోక కంఠకులు, గోవధ చేసేవారు. బ్రహ్మ హత్యాపాతకులు, బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడుఅని ప్రార్థిస్తూ అంబరీషుడు చక్రాయుధానికి ప్రణమిల్లాడు.
అంతట సుదర్శనుడు అంబరీషుడిని లేపి, ఆలింగనం చేసుకుని… ”అంబరీషా! నీ నిష్కళంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం త్రికాలాల్లో ఎవరైతే చేస్తారో.. ఎవరు దాన ధర్మాలతో పుణ్యఫలాన్ని వృద్ధి చేసుకుంటారోఎవరు పరులను హింసించకుండా, పరధనంపై ఆశపడకుండా, పరస్త్రీని చెరపట్టకుండా, గోవధ, బ్రాహ్మణ హత్య, శిశు హత్యాది మహాపాకాలను చేయకుండా ఉంటారోవారి కష్టాలు తొలగిపోయి లోకంలో, పరలోకంలో సుఖశాంతులతో తలతూగుతారు. కాబట్టి, నిన్నూ, దుర్వాసుడిని రక్షిస్తున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావం చాలా గొప్పది. నీ పుణ్య ఫలం ముందు మునిపుంగవుడి తపశ్శక్తి సాటిరాదుఅని చెప్పి అదృశ్యుడయ్యాడు.
ఇతి శ్రీ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్మ్య మందలి అష్టామిశోధ్యాయ: సమాప్త:
ఇరవయ్యెనిమిదో రోజు పారాయణం సమాప్తం
కార్తీకపురాణం – 28 అధ్యాయం : విష్ణు సుదర్శన చక్ర మహిమ
    వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ




కార్తీకపురాణం 27వ అధ్యాయం : దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట

కార్తీకపురాణం 27వ అధ్యాయం : దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట

అత్రిమహాముని తిరిగి అగస్త్యునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ కుంభసంభవా! ఆ శ్రీహరి దుర్వాసుని ఎంతో ప్రేమతో చేరదీసి ఇలా చెబుతున్నాడు…” అని వృత్తాంతాన్ని వివరించారు.
శ్రీమహావిష్ణువు దుర్వాసునితో ఇలా చెబుతున్నాడు… ”ఓ దుర్వాస మహాముని! నీవు అంబరీషుడిని శపించిన విధంగా ఆపాది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారమెత్తుట కష్టం కాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ ఇవ్వక తప్పదు. అందుకు నేను అంగీకరించాను. బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేలా చేయడమే నా కర్తవ్యం. నీవు అంబరీషుని ఇంట్లో భుజించకుండా వచ్చినందుకు అతను చింతతో ఉన్నాడు. బ్రాహ్మణ పరివృత్తుడైనందుకు ప్రాయోపవేశం (అగ్నిలో దూకి ఆత్మహత్య) చేసుకోవాలని నిర్ణయించాడు. ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను బాధించేందుకు పూనుకుంది. ప్రజారక్షణే రాజధర్మం. ప్రజాపీడనం కాదు. ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనట్లయితే… వాన్ని జ్ఞానులైన బ్రాహ్మణులు శిక్షించాలి. ఒక విప్రుడు పాపి అయితే.. మరో విప్రుడు దండించాలి. ధనుర్బాణాలు ధరించి ముష్కరుడై యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప, మరెవ్వరూ బ్రాహ్మణుడిని దండించకూడదు. బ్రాహ్మణ యువకుడిని దండించడం కంటే మరో పాపం లేదని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. బ్రాహ్మణుడి సిగబట్టి లాగినవాడు, కాలితో తన్నినవాడు, విప్రుని ద్రవ్యం అపహరించేవాడు, బ్రాహ్మణుడిని గ్రామం నుంచి తరిమినవాడు, విప్ర పరిత్యాగమొనర్చినవాడు బ్రహ్మ హంతకులే అవుతారు. కాబట్టి ఓ దుర్వాస మహర్షి! అంబరీషుని గురించి తప:శ్శాలి అయిన అంబరీషుడు నీ మూలంగా ప్రాణ సంకటం పొందుతున్నాడు. నేను బ్రహ్మ హత్యచేశానే అని చింతిస్తూ పరితాపం పొందుతున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుడి వద్దకు వెళ్లు. అందువల్ల మీ ఇద్దరికీ శాంతి లభిస్తుంది” అని విష్ణుదేవుడు దుర్వాసునికి నచ్చజెప్పి అంబరీషుడి వద్దకు పంపాడు.
స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తిక మహత్మ్య మందలి సప్త వింశోధ్యాయం – ఇరవయ్యేడవ రోజు పారాయణం సమాప్తం.
కార్తీకపురాణం – 27వ అధ్యాయం : దుర్వాసుడు అంబరీషుని ఆశ్రయించమని శ్రీహరి చెప్పుట
    వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ



కార్తీకపురాణం 26వ అధ్యాయం : దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట

కార్తీకపురాణం 26వ అధ్యాయం : దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట

ఈ విధంగా అత్రిమహముని అగస్త్యునితో – దుర్వాసుడి కోపం వల్ల కలిగిన ప్రమాదాన్ని తెలిపి… మిగతా వృత్తాంతాన్ని ఇలా చెబుతున్నాడు.
సుదర్శనం తరుముతుండగా… ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకం, భువర్లోకం… పాతాలం, సత్యలోకం… ఇలా అన్ని లోకాలు తిరుగుతూ… తనను రక్షించేవారెవరూ లేకపోవడంతో… వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ శ్రీహరిని ధ్యానిస్తూ… ”ఓ వాసుదేవా! పరంధామా! జగన్నాథా! శరణాగతి రక్షకా! నన్ను రక్షించు. నీ భక్తుడైన అంబరీషుడికి కీడు చేయదలిచాను. నేను బ్రాహ్మణుడనై ఉండీ ముక్కోపినై మహా అపరాధం చేశాను. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడగు భృగు మహర్షి నీ హృదయంపైన తన్నినా సహించావు. ఆ కాలి గురుతు నేటికీ నీ వక్షస్థలంపై కనిపిస్తుంది. ప్రశాంత మనస్కుడవై అతన్ని రక్షించినట్లే కోపంతో నీ భక్తునికి శాపం పెట్టిన నన్నుకూడా రక్షింపుము. నీ చక్రాయుధం నన్ను చంపడానికి వస్తోంది. దాని బారి నుంచి నన్ను కాపాడు” అని దుర్వాసుడు శ్రీమన్నారాయణుడిని అనేకరకాలుగా వేడుకొన్నాడు. దుర్వాసుడు అహంకారాన్ని వదిలి ప్రార్థించడంతో… శ్రీహరి చిరునవ్వుతో… ”దుర్వాసా! నీ మాటలు యథార్థాలు. నీవంటి తపోధనులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నీవు బ్రాహ్మణ రూపాన పుట్టిన రుద్రుడవు. నిన్ను చూసి, భయపడకుండా ఉండేవారు వారు ములోకాల్లో లేరు. నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎలాంటి హింసా కలిగించను. ప్రతి యుగంలో గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనులకు సంభవించే ఆపదలను పోగొట్టడానికి ఆయా పరిస్థితులకు తగిన రూపం ధరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావిస్తాను. నీవు అకారణంగా అంబరీషుడిని శపించావు. కానీ నేను శత్రువుకైనా మనోవాక్కాయాలలో సైతం కీడు తలపెట్టను. ఈ ప్రపంచంలోని ప్రాణి సమూహం నా రూపంగానే చూస్తాను. అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తున్నాడు. అలాంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా ధూషించావు. నీ ఎడమపాదంతో తన్నావు. అతని ఇంటికి అతిథివై వచ్చికూడా… నేను వేళకు రానట్లయితే… ద్వాదశి ఘడియలు దాటకుండా నువ్వు భోజనం చేయమని చెప్పలేదు. అతడు వ్రతభంగానికి భయపడి, నీ రాకకోసం ఎదురుచూసి, జలపానం మాత్రం చేశాడు. అంతకంటే అతడు అపరాధమేమిచేశాడు? చాతుర్వర్ణాల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానం దాహశాంతిని, పవిత్రతను చేకూరుస్తుంది కదా? జలపానం చేసినంత మాత్రాన నా భక్తుడిని దూషించావు కదా? అతను వ్రత భంగం కాకూడదనే జలపానం చేశాడే తప్ప, నిన్ను అవమానించాలనే ఉద్దేశంతో కాదు కదా? నీవు మండిపడుతున్నా… దూషిస్తున్నా… అతను బతిమాలి, నిన్ను శాంతిపజేసేందుక ప్రయత్నించాడే తప్ప… ఆగ్రహించలేదు. ఆ సమయంలో నేను అంబరీషుడి హృదయంలో ప్రవేశించాను. నీ శాపం అతనిలో ఉన్న నాకు తగిలింది. నీ శాప ఫలంతో నేను పది జన్మలు అనుభవిస్తాను. అతను నీ వల్ల భయంతో నన్ను శరణు వేడాడు. కానీ, తన దేహం తాను తెలుసుకునే స్థితిలో లేదు. నీ శాపాన్ని అతను వినలేదు. అంబరీషుడు నా భక్తకోటిలో ఒక్కడు. భక్తుల్లో శ్రేష్టుడు. అతను నిరపరాధి, దయాశాలి. ధర్మతత్పరుడు. అలాంటి వాడిని అకారణంగా ధూషించావు. అతన్ని నిష్కారణంగా శపించావు. అయితే… నీవేమీ చింతించకు. ఆ శాపాన్ని నేను స్వీకరించాను. లోకోపకారానికి వాటిని నేను అనుభవిస్తాను. అదెలాగంటే… నీ శాపంలో మొదటి జన్మ మత్స్య జన్మ. నేను ఈ కల్పాన్ని రక్షించేందుకు సోమకుడనే రాక్షసుని చంపేందుకు మత్స్యరూపం ధరిస్తాను. మరికొంత కాలానికి దేవదానవులు క్షీరసాగరంలో మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకుని చిలుకుతారు. ఆ పర్వతాన్ని నీటిలో మునగకుండా నేను కూర్మరూపం ధరించి, నా వీపున మోస్తాను. వరాహ జన్మనెత్తి హిరణ్యాక్షుడిని వధిస్తాను. నరసింహావతారమెత్తి ప్రహ్లాదున్ని రక్షించి, హిరణ్య కశిపుడిని శిక్షిస్తాను. బలిచక్రవర్తి వల్ల ఇంద్రపదవి కోల్పోయిన దేవేంద్రుడికి సింహాసనాన్ని తిరిగి ఇప్పించేందుకు వామన అవతారం ఎత్తుతాను. వామనుడిని పాతాళానికి తొక్కేస్తాను. భూఆరాన్ని తగ్గిస్తాను. అలాగే లోక కంఠకుడైన రావణుడిని చంపి లోకోపకారం చేయడానికి రఘువంశంలో రాముడనై జన్మిస్తాను. ఆ తర్వాత యదువంశంలో శ్రీకృష్ణుడిగా, కలియుగంలో బుద్ధుడిగా, కలియుగాంతంలో విష్ణుచిత్తుడనే బ్రాహ్మణుడి ఇంట్లో కల్కి అనే పేరుతో జన్మిస్తాను. కల్కి అవతారంలో అశ్వారూఢుడనై పరిభ్రమిస్తూ… బ్రహ్మద్వేషులను మట్టుబెడతాను. నీవు అంబరీషుడికి శాపం రూపంలో ఇచ్చిన పదిజన్మలను ఈ విధంగా పూర్తిచేస్తాను. నా దశావతారాలను సదా స్మరించేవారి పాపాలు తొలగిపోయి.. వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఇది అక్షర సత్యం” అని చెప్పాడు.
ఇది స్కాంధపురాణాంతర్గతంలో వశిషుడు చెప్పినటువంటి కార్తీక మహత్యంలోని 26వ అధ్యాయం సమాప్తం
కార్తీకపురాణం – 26వ అధ్యాయం : దుర్వాసుడు శ్రీహరి శరణు వేడుట
    వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం గ్రేటర్ వరంగల్ శాఖ