Saturday, 27 June 2015

పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి



పాములపర్తి వెంకట నరసింహారావు
జననం :28 జూన్ 1921, లక్నేపల్లి, వరంగల్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం )
మరణం :డిసెంబరు 23, 2004 (వయసు 83), న్యూఢిల్లీ, భారతరత
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28 జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.

రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.

కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.మొదటిసారిగా లోక్సభ కు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.

ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది. పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి, రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.

పీవీ విజయాలు
పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. సంస్కరణల పర్యవసానమే, తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు
పీవీ విశిష్టత
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.
2004 డిసెంబర్ 23 పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.
తెలంగాణ రాష్ట్రంలో పివి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయం.
  వల్లూరి పవన్ కుమార్                        
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ   

Sunday, 21 June 2015

దాశరథి రంగాచార్యులు గారికి బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ పక్షాన అశ్రునివాళి



దాశరథి రంగాచార్యులు గారికి బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ పక్షాన అశ్రునివాళి
దాశరథి రంగాచార్యులు విఖ్యాత రచయిత, ప్రముఖ సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడు
దాశరథి రంగాచార్యులు మహాభినిష్క్రమణ
ప్రముఖ రచయిత దాశరథి రంగాచార్య ఈరోజు ఉదయం కన్నుమూశారు.
ఆయన వయస్సు 69 సంవత్సరాలు. అనారోగ్యంతో బాధపడుతున్న రంగాచార్య సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉదయం కన్నుమూశారు.

జీవిత విశేషాలు:-
దాశరథి రంగాచార్యులు  నాటి ఖమ్మం జిల్లా నేటి వరంగల్ జిల్లా లోని చిన్నగూడూర్ లో జన్మించారు. ఆయన అన్న ప్రముఖ కవి, సాయుధపొరాట యోధుడు దాశరథి కృష్ణమాచార్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సాయుధపోరాట కాలంలో ఉపాధ్యాయునిగా, గ్రంథపాలకునిగా పనిచేశారు. సాయుధపోరాటం ముగిసాకా సికిందరాబాద్ పురపాలక కార్పోరేషన్లో 32 ఏళ్ళు పనిచేసి ఉద్యోగవిరమణ చేశారు.

ఉద్యమ రంగం:-
నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచార్య ఎదుగుతూండగా ఆంధ్రమహాసభ, ఆర్య సమాజాలు వేర్వేరుగా నిజాం పాలనలోని లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు. తండ్రి సనాతనవాది ఐనా అన్నగారు ప్రఖ్యాత కవి, అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను, విప్లవ భావాలను అలవర్చుకున్నారు. అసమానతలకు, అణచివేతకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు 1945ల్లో ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు.
తండ్రి కుటుంబకలహాల్లో భాగంగా తల్లినీ, తమనూ వదిలివేయడంతో అన్నతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్టు చేయడంతో కౌమార ప్రాయం ముగిసేలోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథపాలకునిగా, ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్యపరిచారు. క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలురు, భాగస్వాములు దాడిచేసినా వెనుదీయలేదు. పోరాటం కీలకదశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్టు దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు.

సాహిత్య రంగం:-
తెలంగాణా సాయుధ పోరాటం నాటి స్థితిగతులు, కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాశరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలల్లో చిత్రీకరించారు. చిల్లర దేవుళ్లు నవలలో సాయుధపోరాటం ముందు స్థితిగతులు, మోదుగుపూలు నవలలో తెలంగాణ సాయుధ పోరాటకాలం నాటి పరిస్థితులు, అనంతర పరిస్థితులు "జనపదం"లో అక్షరీకరించారు.
వట్టికోట ఆళ్వారుస్వామి ప్రజల మనిషి, గంగు వంటి నవలల ద్వారా నాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు. నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారు స్వామి మరణించారు. సాయుధపోరాట యోధులుగా, సాహిత్యవేత్తలుగా ఆళ్వారుస్వామికీ, రంగాచార్యులకూ సాన్నిహిత్యం ఉండేది. పోరాటానికి పూర్వం, పోరాట కాలం, పోరాటం అనంతరం అనే విభజనతో నవలలు రాసి పోరాటాన్ని నవలలుగా రాసి అక్షరీకరించాలనీ, అది పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్న సాహిత్యవేత్తలపై ఉన్న సామాజిక బాధ్యత అనే అభిప్రాయాలను వారిద్దరూ పంచుకున్నవారే కావడంతో ఆళ్వారుస్వామి మరణానంతరం బాధ్యతను రంగాచార్యులు స్వీకరించారు. నవలా పరంపరలో తొలి నవలగా 1942వరకూ ఉన్న స్థితిగతులు "చిల్లర దేవుళ్లు"లో కనిపిస్తాయి.
నాణానికి మరోవైపు చూస్తే తెలంగాణ పోరాటం ముగిసిన దశాబ్దికి కొందరు నిజాం రాజును మహనీయునిగా, నిజాం రాజ్యస్థితిగతులను ఆదర్శరాజ్యానికి నమూనాగా పలు రాజకీయ కారణాల నేపథ్యంలో కీర్తించారనీ, ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని, ప్రాణాన్ని లెక్కచేయక నిజాంను ఎదిరించిన తమకు ఆనాటి దుర్భర స్థితిగతుల్ని ఇలా అభివర్ణిస్తూంటే ఆవేశం వచ్చేదని రంగాచార్య ఒక సందర్భంలో పేర్కొన్నారు. నిజాం రాజ్యంలో బానిసల్లా జీవించిన ప్రజల స్థితిగతులను, మానప్రాణాలను దొరలు కబళించిన తీరును నేపథ్యంలో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా సాగిన తెలంగాణా సాయుధపోరాటం, పోరాటానంతర స్థితిగతులు వంటివి భావితరాలకై అక్షరరూపంగా భద్రపరచదలిచిన ఆళ్వారుస్వామి ప్రణాళికను స్వీకరించినట్టు రచయిత తెలిపారు.
తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలను అలవరుచుకున్నారు. నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్రామాయణం, శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు. పాత్రికేయులు .బి.కె.ప్రసాద్ ప్రోద్బలంతో ఆత్మకథ "జీవన యానం" రచించారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించారు. వేదాలకు ప్రవేశికగా వేదాలు మానవజాతి అభివృద్ధిపై ఎలాంటి ప్రభావం చూపాయో, నేటి యాంత్రిక నాగరికతకు వేదసాహిత్యంలో ఎటువంటి సమాధానలు ఉన్నాయో వివరిస్తూ "వేదం-జీవన నాదం" రచించారు.
ఇవే కాక ఇతర నవలలు, వ్యాసాలు, పుస్తకాలు కలిపి ఎన్నో పుటల సాహిత్యాన్ని సృష్టించారు.

విశిష్టత, ప్రాచుర్యం:-
దాశరథి రంగాచార్యులు రాసిన "చిల్లర దేవుళ్లు" నవల సినిమాగా తీశారు. టి.మధుసూదనరావు దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఘనవిజయం సాధించింది. పలు భాషలలోకి అనువాదమైంది. రేడియో నాటకంగా ప్రసారమై బహుళప్రాచుర్యం పొందింది.
దాశరథి రంగాచార్యులు విశిష్టమైన సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. తెలంగాణ పోరాట క్రమానికి నవలల రూపం కల్పించడం, తెలంగాణ ప్రాంత చారిత్రిక, సామాజిక, రాజకీయ పరిణామాలకు ప్రతిబింబంగా రచించిన ఆత్మకథ "జీవనయానం" వంటివి సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయి. వేదం లిపిబద్ధం కారాదనే నిబంధనలు ఉండగా ఏకంగా తెలుగులోకి అనువదించడం వంటి విప్లవాత్మకమైన పనులు చేపట్టారు. తెలుగులోకి వేదాలను అనువదించిన వ్యక్తిగా ఆయన సాహిత్యచరిత్రలో స్థానం సంపాదించుకున్నారు.


పురస్కారాలు, సత్కారాలు:-
దాశరథి రంగాచార్యుల "చిల్లర దేవుళ్లు" నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం పొందారు. వేదాలను అనువదించి, మహాభారతాన్ని సులభవచనంగా రచించినందు వల్ల రంగాచార్యులను అభినవ వ్యాసుడు బిరుదు ప్రదానం చేశారు. 21-1-1994 ఖమ్మంలో సాహితీ హారతి ఆధ్వర్యంలో వెండి కిరీటాన్ని పెట్టి రంగాచార్యులు దంపతులకు సత్కరించారు. వేదానువాదం, ఇతర విశిష్ట గ్రంథాల రచన సమయంలో దాశరథి రంగాచార్యులకు విశేషమైన సత్కారాలు, సన్మానాలు జరిగాయి.

రచనలు:-
రంగాచార్యులు నవలలు, ఆత్మకథ, వ్యాసాలు, జీవిత చరిత్రలు, సంప్రదాయ సాహిత్యం తదితర సాహితీప్రక్రియల్లో ఎన్నో రచనలు చేశారు.

నవలలు:-
మోదుగుపూలు
చిల్లర దేవుళ్ళు
జనపథం
రానున్నది ఏది నిజం?
అమృతంగమయ
జీవనయానం
అనువాదాలు
నాలుగు వేదాల అనువాదం
ఉమ్రావ్ జాన్
జీవిత చరిత్ర రచన
శ్రీమద్రామానుజాచార్యులు
బుద్ధుని కత 
శ్రీమద్రామాయణం
శ్రీ మహాభారతం
వేదం-జీవన నాదం
శతాబ్ది

తెలుగు సాహితీరంగానికి ఎనలేని సేవచేసిన శ్రీ దాశరథి రంగాచార్యగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిద్దాం..
మహాయోధుడు, సాహితీవేత్త, తెలంగాణా సాయుధ పోరాట యోధుడికి, బ్రాహ్మణ సంఘం నివాళులు సమర్పిస్తోంది.
   వల్లూరి పవన్ కుమార్     
  - బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ