Wednesday, 31 December 2014

వైకుంఠ / ముక్కోటి ఏకాదశి

వైకుంఠ / ముక్కోటి ఏకాదశి
ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.ధనుర్మాసంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు. విష్ణు ప్రీతికరమైన ఏకాదశులలో ఇది అత్యంత ప్రధానమైనది,పవిత్రమైనది.
అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం|
హృదయం మధురం గమనం మధురం మధురాధిపతే రఖిలం మధురం||
అట్టి సుమధుర మూర్తిని 'ఏకాదశి' రోజున వేయికనులతో వీక్షించి సేవించి తరంచి పోవాలని మూడు కోట్లమంది దేవతలు వైకుంఠమునకు చేరుకునే పుణ్యప్రదమైన రోజు కనుక ఇది వైకుంఠ ఏకాదశిగా "ముక్కోటి ఏకాదశి" గా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఇట్టి పర్వదినం ప్రతిసంవత్సరం ధనుర్మాసములో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశి అవుతుంది.
ప్రముఖ దేవాలయాలలో (తిరుపతి, భద్రాచలం మున్నగు వైష్ణవ) పుణ్యక్షేత్రాలలో మామూలు రోజులలో అయితే, ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. "ముక్కోటి ఏకాదశి" రోజున మాత్రం వాటిని తెరచి ఉంచుతారు. రోజు భక్తులు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యములు, స్నానసంధ్యాదులు ముగించుకొని అట్టి ప్రముఖ ఆలయాలలో ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశించి ప్రదక్షిణలు ముగించుకుని దైవదర్శనం చేసుకుంటూ ఉంటారు. అలా ప్రదక్షిణ క్రమాన్నే "ముక్కోటి ప్రదక్షిణ" అని పిలుస్తూ ఉంటారు.
వైకుంఠ ఏకాదశినే "పుత్రద" ఏకాదశి అని కూడా అంటారు. దీని విశిష్ఠతను తెలిపే ఒక కథ ఉన్నది. పూర్వం "సుకేతుడు" అను మహారాజు 'భద్రావతి' అను రాజ్యాన్ని ప్రజాభీష్టాలను తరచు గమనిస్తూ వాని పరిపాలన ఎల్లప్పుడు జ్ఞప్తికి ఉండేలా ప్రజలకు సర్వసౌఖ్యాలను కలిగిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉండేవాడుట! అట్టి మహారాజు భార్య పేరు 'చంపక' ఆమె అంతటి మహరాణి అయినా, గృహస్ధు ధర్మాన్ని స్వయంగా చక్కగా నిర్వహిస్తూ అతిధి అభ్యాగతులను గౌరవిస్తూ, అటువంటి ఉత్తమమైన భర్త తనకు లభ్యమవటం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తూ, భర్తను పూజిస్తూ, ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు వ్రతాలు చేస్తూ ఉండేది. తదనుగుణంగా మహారాజు కూడా ఆమెను ప్రోత్సహించేవాడు. అట్టి అన్యోన్య పుణ్యదంపతులకు మాత్రం, 'పుత్రసౌభాగ్యం' కరువై, అది వారి జీవితంలో తీరని లోటుగా మారింది.
మహారాజు కూడా పుత్రకాంక్షతో ఎన్నో తీర్ధాలను సేవిస్తూ ఉండగా! ఒక పుణ్యతీర్ధం వద్ద కొందరు మహర్షులు తపస్సుల చేసుకుంటున్నారనే 'వార్త' తెలుసుకుంటాడు. దివ్యమూర్తులను సందర్శించి వారిని సేవించి తనకు పుత్ర భిక్ష పెట్టమని ప్రార్ధిస్తాడు. వారు మహారాజు వేదనను గ్రహించి రాజా! మేము 'విశ్వదేవులము' మీకు పుత్రసంతాన భాగ్యము తప్పకలుగుతుందని దివ్యతేజోమూర్తులు దీవిస్తూ, నేడు సరిగా 'పుత్రద ఏకాదశి' నీవు నీ భార్యతో ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన యెడల మీ మనోభీష్టము తప్పక నెరవేరుతుంది అని చెప్తారు. అంత, వ్రత విధానాన్ని మహర్షుల ద్వారా ఉపదేశము పొంది, పుణ్యమూర్తులకు మరోమారు కృతజ్ఞతా పూర్వకముగా ప్రణమిల్లి శెలవు తీసుకుంటాడు.
వెను వెంటనే అమితోత్సాహముతో నగరానికి చేరుకుని నదీ తీరాన జరిగిన వృతాంతమంతా 'చంపక' దేవితో చెప్తాడు. ఆమె కడు సంతోషించి దంపతులు యిరువురు భక్తి శ్రద్ధలతో శ్రీ లక్ష్మీనారాయణులను, పార్వతీ పరమేశ్వరులను పూజించి, ఉపవాస, జాగరణలతో, భగవన్నామసంకీర్తనలతో మహర్షులు ఉపదేశించిన విధంగా 'ఏకాదశీ వ్రతాన్ని' పూర్తిచేస్తారు.

అనంతరం కొద్దికాలానికి హరి హరాదుల కృపాకటాక్షముతో కులవర్ధనుడైన కుమారుడు కలుగుతాడు. పిల్లవాడు శుక్ల పక్షచంద్రునిలా దినదిన ప్రవర్ధమాన మగుచూ, సత్శీలముతో విద్యాబుద్ధులు నేర్చుకుని యౌవ్వనము రాగానే, తల్లితండ్రుల అభీష్టముపై యువరాజై! ప్రజారంజకముగా పాలిస్తూ ఏకాదశ వ్రత విశిష్టతను రాజ్యమంతటా వివరిస్తూ! ప్రజల అందరిచేత వ్రతాన్ని చేయిస్తాడు. అది 'పుత్రద ఏకాదశి' లోని మహత్యం.
  వల్లూరి పవన్ కుమార్
-బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ

Monday, 22 December 2014

పాములపర్తి వెంకట నరసింహారావు వర్దంతి

పాములపర్తి వెంకట నరసింహారావు వర్దంతి
జననం :28 జూన్ 1921, లక్నేపల్లి, వరంగల్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం )
మరణం :డిసెంబరు 23, 2004 (వయసు 83), న్యూఢిల్లీ, భారతరత
భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు, పాములపర్తి వేంకట నరసింహారావు 1921, జూన్ 28 జన్మించాడు. పి.వి.నరసింహారావు, పీవీ గా ప్రసిద్ధుడైన ఆయన బహుభాషావేత్త, రచయిత. అపర చాణక్యుడిగా పేరుపొందిన వాడు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని సైతం చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
రాష్ట్ర రాజకీయాల్లో పీవీ
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. విషయమై అధిష్టానంతో చర్చించేందుకు ఢిల్లీ, హైదరాబాదుల మధ్య తిరగడంతోటే సరిపోయేది. రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదు లో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. నిజానికి భూసంస్కరణల విషయంలో పీవీకి సమకాలీన రాజకీయ నాయకులతో ఉన్న విభేధాల కారణంగానే ఆయన ముఖ్యమంత్రి పదవిని కోల్పోవలసివచ్చిందని కొందరి వాదన.
కేంద్ర రాజకీయాల్లో పీవీ
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం ఢిల్లీకి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.మొదటిసారిగా లోక్సభ కు హనుమకొండ స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ హనుమకొండ నుండే లోక్సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్సభకు ఎన్నికయ్యాడు. నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి 1991 లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్సభలో అడుగుపెట్టాడు. 1980 - 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు.
ప్రధానమంత్రిగా పీవీ
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. సమయంలో రాజీవ్ గాంధీ హత్య కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుండి గంగుల ప్రతాపరెడ్డిచే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో ఎన్.టి.రామారావు ఆయనపై తెలుగు దేశం అభ్యర్ధిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకు ఉన్న అపార అనుభవం ఆయనకు క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో నెహ్రూ, గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయన రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయన అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా. ప్రధానిగా ఉండగా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా తీసుకురావడం దేశ ప్రగతిలో కీలక మార్పుకు నాంది పలికింది. మరొకవైపు బాబ్రీ మసీదు కూలగొట్టడం కూడా ఆయన హయాంలోనే జరిగింది. చూసీ చూడనట్లు పోనిచ్చాడనే నెపం ఆయనపై ఉన్నది. పి.వి. పెయ్యనాకుడు విధానాన్ని అనుసరించి సమస్యలు తేల్చకుండా నాన్చి, రాజకీయాలలో జిడ్డు వ్యవహారాలు నడిపాడని పేరున్నది. సమస్యలు వాటంతటవే సద్దుకుపోతుండేవి.
పీవీ విజయాలు

పీవీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో భారత రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలలో ఎన్నో గొప్ప మలుపులు, పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నో అవినీతి ఆరోపణలు ప్రభుత్వాన్నీ, పీవీని చుట్టుముట్టాయి. దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు, సంస్కరణలకు బీజం వేసాడు. తన ఆర్థికమంత్రి, మన్మోహన్ సింగ్ కు స్వేచ్ఛనిచ్చి, సంస్కరణలకు ఊతమిచ్చాడు. సంస్కరణల పర్యవసానమే, తరువాతి కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ సాధించిన అద్భుతమైన అభివృద్ధి. అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేర్కొంటారు.
పంజాబు తీవ్రవాదాన్ని విజయవంతంగా అణచివేసిన ఘనత పీవీ ప్రభుత్వానిదే
కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
ఇజ్రాయిల్ తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా,ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
1998 లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయన కాలంలోనే బాంబు తయారయింది. విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు
పీవీ విశిష్టత
బహుభాషా పండితుడు, పీవీ. తెలుగుతో సహా, 17 భాషలలో ధారాళంగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆయనది. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో స్పానిష్ లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో ను అబ్బురపరచాడు.
పీవీ నరసింహారావు చాలా నిరాడంబరుడు. తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన నిజాయతీపరుడు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడానికి ఎప్పుడూ అంగీకరించేవారు కాదు. అలాంటి వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. ఆయనకాగతి పట్టడానికి కారణం ఉత్తరాది లాబీ. కానీ ఎన్ని కష్టాలొచ్చినా తుదివరకూ నిండుకుండలానే ఉన్నారాయన.
2004 డిసెంబర్ 23 పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.
తెలంగాణ రాష్ట్రంలో పివి జయంతిని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయం.
   వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ   


Friday, 19 December 2014

శనిత్రయోదశి

శనిత్రయోదశి
 నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని శాస్త్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్రకాశ్యపన గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని పండితులు అంటున్నారు.
  త్రయోదశి అయితే శనివారము తో కూడి ఉంటుందో రోజు శని గ్రహాన్ని ' శనీశ్వరుడు 'గా సంబోదించి పరమశివుడు వరము ఇచ్చాడు . శని త్రయోదశి అనగా శనికి చాలా ఇష్టం. మూడు దోషాలను పోగొట్టి మానవులు కోరుకున్న యోగాన్ని అందించేవాడు శనేశ్వరుడు.

శని త్రయోదశి ఎలా వాడుకలోనికి వచ్చినది
సృష్టి స్థితి లయ కారకుడైన ఈశ్వరుడునే శని ప్రభావమునకు లోనయ్యాను. సామాన్యులైన మానవులు శని ప్రభావం వల్ల ఎంత ఇక్కట్లు పడుతున్నారో కదా అని ఆలోచించి ఈశ్వరుడు , శని... " నేను ఇక్కడ తపస్సు చేసినందువల్ల నీవు నా పేరు కలుపుకుని శనేశ్వరుడని పేరు పొందగలవు. రోజు శని త్రయోదశి కావున శని త్రయోదశి నాడు నీ వల్ల ఇబ్బందులు పడుతున్నవారు నీ కిష్టమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నీలపు శంఖు పుష్పములు, నల్లని వస్త్రంతో నిన్ను ఎవరైతే అర్పించి ఆరాధిస్తారో .. వారికి నీ వల్ల ఏర్పడిన అనారోగ్యం మృత్యుభయం పోయి ఆరోగ్యం చేకూరగలదు అని వరము ఇస్తునానని తెలిపాడు. తదుపరి త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, పాండవులు, మహామునులు అందరూ కూడా ఈశ్వరునికి అర్చించి తమ దోషాలు పోగొట్టుకున్నారు. శనివారం త్రయోదశి తిథి వచ్చినరోజున శనికి నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆస్వామికి ఇష్టమైన నువ్వులు, నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడనీ ఏలినాటిశని, అర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం లభిస్తుందనీ భక్తుల ప్రగాఢ విశ్వాసం.
"శని" భగవానునికి అత్యంత ప్రీతికరమైన రోజు శనివారం త్రయోదశి రోజు .

శనిత్రయోదశి పూజ కోసము వారు కొన్ని నియమాలను పాటించవలసి వుంటుంది.
1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగినవారు ఆరోజు పగలు ఉపవాసము ఉండి సాయంత్రము 8గంటలతరువాత భోజనాదులను చేయటము.
2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు.
3. వీలైన వారుశివార్చన స్వయముగా చేయటము.
4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం,ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం.
5. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా "ఓం నమ:శివాయ" అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించటం.
6. ఆరోజు (కుంటివాళ్ళు,వికలాంగులకు) ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
7. ఎవరివద్దనుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.

శని మహత్యం
శనిభగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట ! పరిహాసాన్ని విన్న శని కోపగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాటలాడి, అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, చేయని దొంగతనపు నింద మోపబడి, పొరుగు రాజుచే కాళ్ళు, చేతులు నరికివేయబడ్డాడు. చివరికి, విసిగి వేసారిపోయి, బాధలు ఏమాత్రం భరించే ఓపికలేక, నిర్వీర్యుడై, భ్రష్టుడై, చేసేదిలేక, తనను కనికరింపమని శనిదేవుని అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్ధించగా, విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింప చేసాడు. శనిమహాత్మ్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల, ఋషుల మీద శనిప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శనిమహాత్మ్యం, కష్టసమయాలలో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి, నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్దలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తుంది .
బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం, పార్వతీ దేవి, నలుగు పిండి బొమ్మకు ప్రాణం పోసినప్పుడు వినాయకుడు జన్మించాడు. అప్పుడు సకల దేవతలు, నవగ్రహాలు బాల వినాయకుడిని చూడటానికివచ్చారు. ముగ్ద మోహన బాలుడిని అక్కడకు విచ్చేసిన దేవతలు మునులు కనులార చూసి దీవెనలు అందించి పార్వతీ దేవికి మోదం కలిగించారు. శనిభగవానుడు మాత్రం తల ఎత్తి బాలుని చూడాలేదు. అందుకు పార్వతీదేవి కినుక వహించి, తన బిడ్డను చూడమని శనిని ఆదేశించింది. అయినా శని తన దృష్టి బాలగణపతి పై సారించలేదు. తన దృష్టి పడితే ఎవరికైనా కష్టాలు తప్పవని ఎంత నచ్చచెప్పినా, మాతృ గర్వంతో శననీశ్వరుడి సదుద్దేశం తెలుసుకోలేక, పార్వతీ దేవి తనకుమారుని చూడమని పదే పదే శనిని ఆదేశించింది. శని తల ఎత్తి చూసిన కారణంగా బాల గణపతి మానవ రూపంలో ఉండే తలను కోల్పోయినాడని పురాణాలు తెలుపుతున్నాయి.

శనీశ్వర జపం
శనీశ్వరుడి జప మంత్రాలు
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||

శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే
ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.
|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: ||
||ఓం శం శనైస్కర్యయే నమః||
||ఓం శం శనైశ్వరాయ నమః||
||ఓం ప్రాంగ్ ప్రీంగ్ ప్రౌంగ్ : శనయే నమః ||
||కోణస్ధః పింగళో బబ్రుః కృష్ణో రౌద్రంతకో యమః సౌరిః శనైశ్చరో మందహ పిప్పలాదేన సంస్తుత:||
ఓం నమో శనైశ్వరా పాహిమాం,
ఓం నమో మందగమనా పాహిమాం,
ఓం నమో సూర్య పుత్రా పాహిమాం,
ఓం నమో చాయాసుతా పాహిమాం,
ఓం నమో జేష్టపత్ని సమేత పాహిమాం,
ఓం నమో యమ ప్రత్యది దేవా పాహిమాం,
ఓం నమో గృధ్రవాహాయ పాహిమాం
   వల్లూరి పవన్ కుమార్ 
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ