Friday, 26 September 2014
Thursday, 25 September 2014
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం ‘సిద్ధిదాత్రి’
9. సిద్ధిదాత్రి
– నవదుర్గలు
సిద్ధగంధర్వయక్షాద్యైః
అసురైరమరైరపి ।
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా
సిద్ధిదాయినీ ॥
దుర్గామాత తొమ్మిదవ శక్తి స్వరూప నామం
‘సిద్ధిదాత్రి’. ఈమె సర్వవిధ సిద్ధులనూ
ప్రసాదిస్తుంది. మార్కండేయ పురాణంలో 1) అణిమ, 2) మహిమ, 3) గరిమ, 4) లఘిమ, 5) ప్రాప్తి, 6) ప్రాకామ్యము, 7) ఈశిత్వము, 8) వశిత్వము అని సిద్ధులు ఎనిమిది
రకాలుగా పేర్కొన బడ్డాయి. బ్రహ్మవైవర్త పురాణంలోని శ్రీకృష్ణ జన్మ ఖండంలో సిద్ధులు
అష్టాదశ విధాలుగా తెలుపబడ్డాయి. అవి…
1) అణీమ, 2) లఘీమ, 3) ప్రాప్తి, 4) ప్రాకామ్యము, 5) మహిమ, 6) ఈశిత్వ వశిత్వాలు, 7) సర్వకామావసాయిత, 8) సర్వజ్ఞత్వం, 9) దూరశ్రవణం, 10) పరకాయ ప్రవేశం, 11) వాక్సిద్ధి, 12) కల్పవృక్షత్వం, 13) సృష్టి, 14) సంహారకరణ సామర్థ్యం, 15) అమరత్వం, 16) సర్వన్యాయకత్వం, 17) భావన మరియు 18) సిద్ధి.
సిద్ధిదాత్రి మాత భక్తులకూ, సాధకులకూ
ఈ సిద్ధులన్నింటిని ప్రసాదించగలదు. పరమేశ్వరుడు ఈ సర్వ సిద్ధులను
దేవి కృపవలననే పొందారని దేవీ పురాణం పేర్కొంటుంది.
ఈ సిద్ధిదాత్రి మాత పరమశివునిపై దయ
తలచి, ఆయన శరీరంలో అర్ధభాగమై
నిలిచింది. కనుక ఆయన అర్ధనారీశ్వరుడుగా
వాసికెక్కారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. సింహవాహన.
ఈ దేవీ స్వరూపం కమలంపై
ఆసీనురాలై ఉంటుంది. ఈమె కుడివైపు ఒక
చేతిలో చక్రాన్ని దాల్చి ఉంటుంది. మరొక చేతిలో గదను
ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేతిలో శంఖాన్నీ,
మరొక హస్తంలో కమలాన్నీ దాల్చి దర్శనమిస్తుంది.
నవరాత్రి మహోత్సవాల్లో తొమ్మిదవరోజున ఉపాసించబడే దేవీ స్వరూపం ఈమెదే.
తొమ్మిదవరోజున శాస్త్రీయ విధి విధానాలతో సంపూర్ణ
నిష్ఠతో ఈమెను ఆరాధించేవారికి సకల
సిద్ధులూ కరతలామలకం అవుతాయి. సృష్టిలో ఈమెకు అగమ్యమైనది ఏదీ
లేదు. ఈ మాత కృపతో
ఉపాసకుడికి ఈ బ్రహ్మాండాన్నే జయించే
సామర్థ్యం లభిస్తుంది.
ఈ సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రులవ్వడానికి
నిరంతరం ప్రతీ వ్యక్తీ ప్రయత్నించాలి.
ఈ మాత దయా ప్రభావంవల్ల
అతడు అనంతమైన దుఃఖరూప సంసారం నుండి నిర్లిప్తుడవ్వగలడు. అన్ని సుఖాలను
పొందడమే కాకుండా మోక్షాన్ని సైతం పొందుతాడు.
నవదుర్గల్లో ‘సిద్ధిదాత్రి’ అవతారం చివరిది. మొదటి ఎనిమిది రోజుల్లో
క్రమంగా దుర్గాదేవి ఎనిమిది అవతారాలను విద్యుక్తంగా నిష్ఠతో ఆరాధించి, తొమ్మిదవ రోజు ఉపాసకుడు ఈ
సిద్ధిదాత్రి ఆరాధనలో నిమగ్నుడు కావాలి. ఈ దేవిని ఉపాసించడం
ముగియగానే భక్తులయొక్క, సాధకులయొక్క లౌకిక, పారలౌకిక మనోరథాలన్నీ సఫలమవుతాయి. సిద్ధిదాత్రి మాత కృపకు పాత్రుడైన
భక్తుడికి కోరికలేవీ మిగిలి ఉండవు. ఇలాంటి భక్తుడు అన్ని విధాలైన సాంసారిక
వాంఛలకు, అవసరాలకు, ఆసక్తులకు అతీతుడవుతాడు. అతడు మానసికంగా భగవతీ
దేవి దివ్య లోకంలో విహరిస్తాడు.
ఆ దేవీ కృపారసామృతం నిరంతరంగా
ఆస్వాదిస్తూ, విషయ భోగ విరక్తుడవుతాడు.
అట్టి వారికి భగవతీ దేవి సాన్నిధ్యమే
సర్వస్వంగా ఉంటుంది. ఈ పరమ పదాన్ని
పొందిన వెంటనే అతనికి ఇతరాలైన ప్రాపంచిక వస్తువుల అవసరం ఏ మాత్రం
ఉండదు.
దుర్గామాత చరణ సన్నిధిని చేరటానికై
మనం నిరంతరం నియమ నిష్ఠలతో ఆమెను
ఉపాసించడమే కర్తవ్యం. భగవతీ మాత స్మరణ,
ధ్యాన పూజాదికాల ప్రభావం వల్ల ఈ సంసారం
నిస్సారమని మనకు బోధ పడుతుంది.
తన్మహత్త్వాన నిజమైన పరమానందదాయకమైన అమృత పథం మనకు
ప్రాప్తిస్తుంది.
వల్లూరి పవన్ కుమార్
- బ్రాహ్మణ సంఘం వరంగల్ అర్బన్ శాఖ
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూప నామం ‘మహాగౌరి’
8. మహాగౌరి – నవదుర్గలు
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా
శుచిః ।
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవప్రమోదదా
॥
దుర్గామాత యొక్క ఎనిమిదవ స్వరూపానికి
‘మహాగౌరి’ అని పేరు. ఈమె
పూర్తిగా గౌరవర్ణశోభిత. ఈమె గౌరవర్ణశోభలు మల్లెపూలూ,
శంఖం, చంద్రులను తలపింపజేస్తాయి. ఈమె అష్టవర్షప్రాయముగలది (అష్టవర్షభవేద్గౌరీ). ఈమె ధరించే
వస్త్రాలూ, ఆభరణాలూ ధవళ కాంతులను వెదజల్లుతుంటాయి.
చతుర్భుజ, సింహవాహన. ఒక కుడిచేత అభయముద్రనూ,
మరొక కుడి చేతిలో త్రిశూలాన్నీ
వహించి ఉంటుంది. ఒక ఏడమచేతిలో డమరుకమూ,
మరొక ఎడమ చేతిలో వరదముద్రనూ
కలిగి ఉంటుంది. ఈ ముద్రలలో ఈమె
దర్శనం ప్రశాంతంగా ఉంటుంది. పార్వతి అవతారంలో ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా
పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. వ్రియేఽహం వరదం శంభుం నాన్యం
దేవం మహేశ్వరాత్ (నారద పాంచరాత్రము) అనేది
ఈమె ప్రతిజ్ఞ. భగవంతుడైన శివుణ్ణి పరిణయమాడటానికే దృఢంగా సంకల్పించుకొన్నట్లు తులసీదాస మహాకవి పేర్కొన్నాడు.
జన్మకోటిలగి రగర హమారీ ।
బర ఉఁసంభు న తరహ ఉఁకుఁమారీ
॥
కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా
నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన
శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో
ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె శ్వేతవర్ణశోభిత అయి
విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె ‘మహాగౌరి’ అని
వాసి గాంచింది.
దుర్గా నవరాత్రోత్సవాల్లో ఎనిమిదవ రోజున మహాగౌరి ఉపాసన
విధ్యుక్తంగా నిర్వహించబడుతుంది. ఈమె శక్తి అమోఘమూ,
సధ్యఃఫలదాయకము. ఈమెను ఉపాసించిన భక్తుల
కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వసంచిత పాపాలన్నీ
పూర్తిగా నశిస్తాయి. భవిష్యత్తులో కూడా పాపతాపాలుగానీ, దైన్యదుఃఖాలు
కానీ వారి దరిజేరవు. వారు
సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.
మహాగౌరీమాతను ధ్యానించటం, స్మరించటం, పూజించటం, ఆరాధించటం, మున్నగు రీతుల్లో సేవించటం వల్ల భక్తులకు సర్వ
విధాలైనట్టి శుభాలు చేకూరుతాయి. మనము ఎల్లప్పుడు ఈమెను
ధ్యానిస్తూ ఉండాలి. దేవి కృపవల్ల ఎల్లరికీ
అలౌకిక సిద్ధులు ప్రాప్తిస్తాయి. మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో
సాధకులు ఈ దేవి పాదారవిందాలను
సేవించటంవల్ల వారి కష్ఠాలు మటుమాయమవుతాయి.
ఈమె ఉపాసన ప్రభావం వల్ల
అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి. కనుక
సర్వదా సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే
కర్తవ్యము. పురాణాలలో ఈమె మహిమలు శతథా
ప్రస్తుతించబడ్డాయి. ఈమె సాధకుల మనో
వ్యాపారాలను అపమార్గాలనుండి సన్మార్గానికి మరలిస్తుంది. మనం అనన్య భక్తి
ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో
శుభదాయకం.
వల్లూరి పవన్ కుమార్
Subscribe to:
Posts (Atom)