Monday, 31 March 2014

బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ

ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం ఇదే మన శక్తి
-రాజకీయ పార్టీలను యాచించవద్దు, శాసించాలి
-ప్రశ్నిస్తే వర్తమానం, భవిష్యత్తు మనదే..
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ పిలుపు
-బ్రాహ్మణులను పార్టీలు గుర్తించడం లేదు
-సహస్రవిప్రగడప మంథనిలో ఆ వెలుగులేవి?
-పురోహితులు పట్టణాల బాట పట్టారు
-తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల ఆధిపత్యం
-బ్రాహ్మణ ఆత్మగౌరవ సభలో సీఎల్ రాజం
హైదరాబాద్ : సమాజ సౌభాగ్యానికి, ఉన్నతికి సమస్త శక్తులను ధారపోసిన బ్రాహ్మణులను రాజకీయ పార్టీలు తగిన రీతిలో గుర్తించటం లేదని బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయ పార్టీలు రేపటి ఎన్నికలలో కచ్చితంగా బ్రాహ్మణులకు జనాభా దామాషాలో ప్రాధాన్యం కల్పించాల్సిందేనని డిమాండ్ చేసింది. ఇదం బ్రాహ్మ్యం, ఇదం క్షాత్రం అనే శక్తితో వర్తమాన రాజకీయ సమాజాన్ని ప్రశ్నించటానికి బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని సభ స్పష్టం చేసింది.
 బ్రాహ్మణులందరూ ఐక్యమై, సంఘటితంగా రాజకీయ పార్టీలను శాసించాలని, యాచించడం ద్వారా కాకుండా రాజకీయ పార్టీలను శాసించే విధంగా బ్రాహ్మణులు తమ శక్తులను, యుక్తులను ఉపయోగించాలని సభ పిలుపునిచ్చింది. బ్రాహ్మణుల రాజకీయ ఉనికిని చాటి చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేశామని నిర్వాహకులు స్పష్టం చేశారు. శనివారం బ్రాహ్మణ సంఘాలు, బ్రాహ్మణ వివాహ పరిచయ వేదికల నిర్వహణలో నిజాంకాలేజీ మైదానంలో బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ జరిగింది. జై బ్రాహ్మణ్, బ్రాహ్మణుల ఐక్యత వర్థిల్లాలి వంటి నినాదాలతో సభా స్థలి దద్దరిల్లింది. ఈ సభకు బ్రాహ్మణ సంఘాల చైర్మన్, నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం అధ్యక్షత వహించారు. బ్రాహ్మణులందరినీ సీఎల్ రాజం, విజయరాజం సత్కరించారు. అదేవిధంగా బ్రాహ్మణసంఘాలు ఈ దంపతులను ఘనంగా సన్మానించాయి. వివిధ పార్టీలలో రాజకీయంగా కీలకస్థానాల్లో ఉన్న బ్రాహ్మణులు, రేపటి ఎన్నికలలో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆశావహులు, వేదపండితులు, అర్చక సమాఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎల్ రాజం మాట్లాడుతూ స్వాతంత్య్రోద్యమకాలంలో 158 మందికి బ్రిటిష్ పాలకులు ఉరిశిక్ష వేయగా ఇందులో 50శాతం మంది బ్రాహ్మణులే దేశమాత దాస్యశృఖలాలను ఛేదించడానికి ఉరికంబాన్ని ఎక్కారని చెప్పారు. అండమాన్ జైలులో 500 మంది ఖైదీలు నరకయాతన అనుభవించగా అదు లో 260 మంది బ్రాహ్మణులు ఉండేవారని గుర్తు చేశారు.
త్యాగనిరతిలో, వితరణశీలతలో, ఉద్యమబావుటాను ఎగురవేయడంలో అగ్రభాగంలో ఉన్న బ్రాహ్మణులను, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకోసం ఉరికంబాలను ముద్దాడిన బ్రాహ్మణులను, బ్రాహ్మణ కుటుంబాలను రాజకీయ పార్టీలు పూర్తిగా విస్మరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సహస్రవిప్రగడపగా భాసిల్లిన మంథనిలో ఆ వెలుగులు కనిపించటం లేదని, మంథని బ్రాహ్మణులు యాచకులవుతున్నారని విచారం వెలిబుచ్చారు. పురహితం కోరిన పురోహితులు పట్టణాల బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, అర్ధాకలి వాళ్లని పట్టణాలకు తరిమికొట్టిందని పేర్కొన్నారు. అన్నసంతర్పణలు చేసిన అగ్రహారీకులు యాచకులయ్యారని ఆయన బ్రాహ్మణుల దైన్యస్థితిని విశదీకరించారు. తెలంగాణలోని 10వేల అర్చక కుటుంబాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయని రాజం ఘోషించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వాణిజ్యవేత్తలు, ఉన్నతస్థాయి అధికారుల్లో బ్రాహ్మణులదే అగ్రస్థానమైనప్పటికీ రాజకీయరంగంలో మాత్రం ప్రాతినిధ్యం లేదని అన్నారు. ఈ కారణాలన్నింటినీ విశ్లేషించుకొని, కర్తవ్యాన్ని నిర్వచించుకొని రాజకీయ పార్టీలను ప్రశ్నిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణలో 40 నియోజకవర్గాలలో బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువగా ఉన్నదన్న రాజం.. రాజకీయ పార్టీలు ఆయా నియోజకవర్గాలో బ్రాహ్మణులకు టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణుల, అర్చకుల సమస్యలకు నమస్తే తెలంగాణలో తప్పకుండా అవకాశం ఇస్తామని, కృష్ణా పత్రికలో బ్రాహ్మణులకు ముట్నూరి అవకాశం ఇచ్చినట్లుగా నమస్తే తెలంగాణ బ్రాహ్మణుల పక్షం ఉంటుందని హామీ ఇచ్చారు.
నమస్తే తెలంగాణ డైరెక్టర్ విజయరాజం మాట్లాడుతూ బ్రాహ్మణులు ఐక్యతను చాటడం అద్భుతాలలో అద్భుతమని అభివర్ణించారు. నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులలో బ్రాహ్మణులు ఐక్యం కావడం గొప్ప విషయమని అన్నారు. రాజకీయంగా ఉనికి చాటేందుకు బ్రాహ్మణులు సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఈ సభ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఆచారాలను, సంప్రదాయాలను, తపఃశక్తిని కొనసాగిస్తున్నందుననే విప్రులు శక్తిమంతులయ్యారని ఆమె అన్నారు. కాశ్మీరీ పండితులను ఊచకోత కోసిన నాటినుంచి బ్రాహ్మణులు ఆగ్రహంగానే ఉన్నారని, రాజకీయ ప్రాధాన్యంకోసం పరిశ్రమిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణులు తమ స్వార్థం కోసం, ధనార్జనకోసం టికెట్లు అడగటం లేదని, సర్వేజనాఃసుఖినోభవంతు అనే ఆర్యోక్తిని రాజకీయరంగంలో చాటి చెప్పటం కోసమే రాజకీయ వాటా అడుగుతున్నారని స్పష్టం చేశారు. వీరితో పాటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేవీ రమణాచారి, సుధీశ్ రాంభొట్ల, మాజీ డీజీపీ అరవిందరావు, ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్కుమార్, జనక్ప్రసాద్, కటకం మృత్యుంజయ, ద్రోణంరాజు రవికుమార్, తులసీ శ్రీనివాస్, దర్శనమ్ వెంకటరమణశర్మ, గంగు ఉపేంద్రశర్మ, గంగు భానుమూర్తి, బాచుపల్లి సుధాకరశర్మ, సరస్వతీశర్మ, వాణి, జ్వాలా నరసింహారావు, గిడుగు రుద్రరాజు, మురళీ దేశ్పాండే తదితరులు ఈ సభలో పాల్గొన్నారు. కేవీ రమణాచారి మాట్లాడుతూ రాజకీయ ప్రశ్నలను సంధించడానికే బ్రాహ్మణ ఆత్మగౌరవ సభ ఏర్పరచామని స్పష్టం చేశారు. ఈ బాధ్యతను తీసుకొని బ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్పిన సీఎల్ రాజం అభినందనీయులని ప్రశంసించారు. టీఆర్ఎస్ ప్రకటించినట్లుగా రాజకీయ పార్టీలు బ్రాహ్మణులకు ఇచ్చే టికెట్ల వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
రాజ్యాధికారం కావాలంటే అన్ని వర్గాలతో మమేకం కావాలి : శ్రీధర్బాబు
బ్రాహ్మణులకు రాజ్యాధికారం కావాలంటే ఇతర వర్గాలతో మమేకం కావాలని మాజీ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల ఆత్మగౌరవసభలో శ్రీధర్బాబు మాట్లాడుతూ బ్రాహ్మణ యువకులు సంఘసేవలో నిమగ్నమై ముందుకు వెళ్తే గొప్ప పదవులు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. నమస్తే తెలంగాణ సీఎండీ సీ లక్ష్మీరాజం సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఎదగలేదన్నారు. తెలివితో, జ్ఞానబుద్ధితో గొప్ప స్థాయికి వచ్చారని ప్రశంసించారు. రాజం స్ఫూర్తిగా యువత ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు సంస్కరణలు నేడు ఫలితాలను ఇస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పీవీవంటి వ్యక్తులను తయారు చేయాలనే ఉద్దేశంతో సీఎల్ రాజం ఈ ఆత్మగౌరవసభ ఏర్పాటు చేశారని కొనియాడారు. అర్చక సమాజానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ప్రయోజనాలు చేకూర్చిందని చెప్పారు. భవిష్యత్లో అర్చకుల సంక్షేమానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని, పేద బ్రాహ్మణులను ఆదుకునే విషయంలో ముందుంటుందని చెప్పారు. బ్రాహ్మణ కులానికి చెందిన పూర్వీకులు మంచి బాట వేశారని, వారి బాటలో నడిస్తే బ్రాహ్మణులకు గౌరవం వస్తుందని అన్నారు. వారి సంకల్పమే నేటి ఆత్మగౌరవసభగా శ్రీధర్బాబు కొనియాడారు. ఐక్యతతో ముందుకు వెళ్తే బ్రాహ్మణులకు విజయం ఖాయమన్నారు.
దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటింది బ్రాహ్మణులే: ఆర్ కృష్ణయ్య
భారతదేశ సాంస్కతిక ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత బ్రాహ్మణులదేనని టీడీపీ నాయకుడు ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. నాలుగువేల సంవత్సరాల క్రితమే బ్రాహ్మణులు అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్నారని చరిత్ర చెబుతోందని అన్నారు. బ్రాహ్మణుల శక్తిని తక్కువ అంచనా వేయడానికి వీలులేదన్నారు. కులాల మధ్య అంతరాలు బ్రాహ్మణులు తెచ్చారన్నదీ అవాస్తవమని చెప్పారు. సమాజంలో అంతరించిపోతున్న మానవ విలువల అభ్యున్నతికి బ్రాహ్మణ సమాజం పాటుపడాలని కోరారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్ల అర్చకులు అర్ధాకలితో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. లోకహితాన్ని కోరే బ్రాహ్మణులకు రాజకీయంగా అన్ని పార్టీలు వాటా ఇవ్వాలన్నారు. సమాజానికి విజ్ఞాన వీచికలు అందించిన బ్రాహ్మణులకు సరైన ప్రోత్సాహం అందించాలని పిలుపునిచ్చారు.


సమాజంలో 6% ఉన్న బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేసిన పార్టీలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ నాయకుడు సుధీష్ రాంభొట్ల పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం బ్రాహ్మణులకు అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు సమాజంలో మమేకమై ఉండటంతో రాజకీయ పార్టీలు ఆదరిస్తాయని అభిప్రాయపడ్డారు.
రాజం రాజ్యసభ సభ్యులైతే ఇక బ్రాహ్మణులకు భయంలేదు: పీవీ రాజేశ్వర్రావు
నమస్తే తెలంగాణ అధిపతి సీఎల్ రాజం రాజ్యసభ సభ్యుడు అవుతున్నారని, దీనివల్ల బ్రాహ్మణులకు అండ ఉండే అవకాశమున్నందున భయపడాల్సిన అవసరం లేదని మాజీ పార్లమెంటు సభ్యుడు పీవీ రాజేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. పదవిలో ఉన్నా, లేకున్నా రాజంకు రాజ్యాధికారం కొనసాగించేందుకు సహకరిస్తానన్నారు. నిజాం కళాశాల చరిత్రలో ఇంత పెద్ద బ్రాహ్మణుల సభ జరుగడం ప్రథమమని చెప్పారు. నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 16 సీట్లు బ్రాహ్మణులకు ఇచ్చారని, ప్రస్తుతం అవి నాలుగుకు తగ్గాయని అన్నారు. పీవీ నరసింహరావు దార్శనికతను ప్రతీ పార్టీ నేడు కొనియాడుతుంటే, కాంగ్రెస్ మాత్రం పీవీ గురించి ఆలోచించడం లేదన్నారు.
బ్రాహ్మణులు తలుచుకుంటే ఏ పార్టీనైనా సింహాసనం ఎక్కించగలగడమేగాకుండా దించగలరని మహా సహస్రవధాని గరికపాటి నరసింహారావు హెచ్చరించారు. రెండు రాష్ర్టాలను అభివృద్ధిపరిచే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందన్నారు. దేశాభివృద్ధిలో బ్రాహ్మణులు చేసిన త్యాగం సామాన్యమైనది కాదన్నారు. బ్రాహ్మణల జోలికొస్తే సినిమాల విషయంలో పద్మశ్రీలేకాకుండా పదవులు, ప్రాణాలు పోతాయని అభిప్రాయపడ్డారు. సూర్యచంద్రులను శాసించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని చెప్పారు. రాజ్యంగాన్ని వంద రకాలుగా భాషించగలమని అన్నారు. బ్రాహ్మణుల ఎన్నికల గుర్తు జంధ్యం, యజ్ఞోపవీతం కావాలని పిలుపునిచ్చారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిన పీవీ సమర్ధతను, ఉండవల్లివంటి వారి వాక్చాతుర్యాన్ని వాడుకుని వదిలివేశారని అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణుల తపోశక్తితో యువత భవితకు ఉజ్వల భవిష్యత్ ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
రాజం మాటల వ్యక్తి కాదు చేతల వ్యక్తి : కటకం మృత్యుంజయం
బ్రాహ్మణుల అభివృద్ధికాంక్షను మాటలకు పరిమితం చేయకుండా చేతల్లో చూపెడుతున్న వ్యక్తి సీఎల్ రాజం అని టీ పీసీసీ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అభిప్రాయపడ్డారు. బ్రాహ్మణులు వివిధ వేదికలపై రాజకీయాధికారం దక్కించుకునేలా కృషి చేయాలని సూచించారు. ఆత్మగౌరవసభతో ఆగిపోకుండా బ్రాహ్మణుల అభివృద్ధి కోసం సదస్సులు నిర్వహించి, చర్చ జరుపాలని అభిప్రాయపడ్డారు.
రాజ్యాధికారం కోసం బ్రాహ్మణులు తమ పౌరుషాన్ని చూపాలని వైఎస్సార్సీపీ నేత జనక్ప్రసాద్ అన్నారు. బ్రాహ్మణుల ఐక్యత కోసం సీఎల్ రాజం కృషి అభినందనీయమని కొనియాడారు. రాజకీయాల్లో బ్రాహ్మణులకు మెరుగ్గా రాణించే సత్తా ఉందన్నారు.
ధర్మాన్ని రక్షించే శక్తి బ్రాహ్మణులకే ఉంది: రాంచంద్రరావు
ధర్మాన్ని రక్షించే శక్తి కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉందని బీజేపీ అధికార ప్రతినిధి రాంచంద్రరావు అభిప్రాయపడ్డారు. దేశ సంస్కృతిని కాపాడాలంటే బ్రాహ్మణుల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. బ్రాహ్మణులకు రాజ్యాధికారం రావడంద్వారా వారి ప్రయోజనాలు నెరవేరడంతోపాటు, దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు.
వల్లూరి పవన్ కుమార్
9246812727   9246752735
( బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ అద్యక్షులు )









Sunday, 30 March 2014

షడ్రుచుల సమ్మేళనం ‘ఉగాది పచ్చడి’:-

షడ్రుచుల సమ్మేళనం ‘ఉగాది పచ్చడి’:-

ప్రాముఖ్యత

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంది . "ఉగాది పచ్చడి" ఈ పండుగకు మాత్రమే ప్రత్యేకమైన ఒక తినే పదార్ధం. ఉగాదినాడు షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఉగాది పచ్చడికి మనశాస్త్రాలలో "నింబ కుసుమ భక్షణం" మరియు "అశోకకళికా ప్రాశనం " అని వ్యవహరించే వారు. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు'వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు మరియు అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినాలని శాస్త్రాలు చెబుతున్నాయి. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతీకగా:-
బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం వేప పువ్వు - చేదు -బాధకలిగించే అనుభవాలు చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు పచ్చి మామిడి ముక్కలు - పులుపు - కొత్త సవాళ్లు మిరపపొడి - కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు ప్రొద్దునే ఇంటి ఆడవారు పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు. ఇంట్లోవారంతా స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకొని పరగడుపున ఉగాది పచ్చడి తిని తర్వాత అల్పాహారం తీసుకుంటారు. "త్వామష్ఠ శోక నరాభీష్టమధుమాస సముద్భవనిబామి శోక సంతప్తాంమమ శోకం సదా కురు" ఈ మంత్రం చదువుతూ ఉగాది పచ్చడి తినాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఉగాది పచ్చడి చేసే ఆచారం ఆహారం లో ఉండే ఔషధ గుణాన్ని, వృక్షసంరక్షణ అవసరాన్ని, ఆయుర్వేదానికి ఆహారానికి గల సంబంధాన్ని చెప్పడమే కాక పండుగలకు, ఆచారాలకు, సముచిత ఆహారానికి గల సంబంధాన్ని చాటిచెప్తుంది. ఆ రకంగా తమ జీవితాలు అన్ని అన్నిభావాల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

వల్లూరి పవన్ కుమార్    

9246812727 , 9246752735
( బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ అద్యక్షులు )  




ఉగాది

ఉగాది 
ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది, తెలుగువారు జరుపుకునే పండుగలలో ముఖ్యమయినది. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఉదయాన లేచి తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు. దేవస్థానములకు వెళ్ళి పూజలు చేయిస్తారు. కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలసుకొని గ్రహశాంతుల లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండటానికి పంచాగశ్రవణాన్ని చేస్తారు. ఈ పండగ ఒక్క తెలుగు సాంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడి పడ్వాగా నూ, తమిళులు పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు. ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం ప్రారంభించారని నమ్ముతారు. మత్స్యావతారము ధరించిన విష్ణువు సోమకుని సంహరించి వేదాలను బ్రహ్మకప్పగించిన సందర్భంగా 'ఉగాది' ఆచరణలోకి వచ్చెనని పురాణప్రతీతి. బ్రహ్మదేవుడు ఈ జగత్తును చైత్ర మాస శుక్లపక్ష ప్రథమ దినాన సూర్యోదయ వేళ సమగ్రంగా సృష్టించాడంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస, వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఈనాడు ప్రవర్తింప చేసాడన్నది పెద్దల భావన. అంతే కాదు వసంత ఋతువు కూడా అప్పుడే మొదలవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందికి గుర్తుగా ఉగాది పండుగను జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిషిక్తుడైన దినం కారణంగా ఈ పండుగ ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరొక గాధ."ఉగాది", మరియు "యుగాది" అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. "ఉగ" అనగా నక్షత్ర గమనం. నక్షత్రగమనానికి 'ఆది' 'ఉగాది'.అంటే సృష్టి ఆరంభమైనదినమే "ఉగాది". 'యుగము' అనగా ద్వయము లేక జంట అని కూడా అర్ధము. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం 'యుగం' (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది (సంవత్సరాది) యుగాది అయింది. యుగాది శబ్దానికి ప్రతిరూపమైన ఉగాదిగా వ్యవహృతమైనది. "తత్రచైత్రశుక్ల ప్రతిపదిసంవత్సరారంభ:" - చైత్రశుద్ధ పాడ్యమి నాడు సంవత్సరాది 'ఉగాది'గా ఆచరణీయమని నిర్ణయసింధుకారుడు పేర్కొనియున్నాడు. సంప్రదాయాలు: ప్రతి సంవత్సరం చైత్రమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి తిథినాడు ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. నిర్ణయ సింధు ధర్మ సింధులలో దీనికి సంబంధించిన ప్రమాణాలు కనుపిస్తున్నాయి. ఉగాదిరోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం. మున్నగు ‘పంచకృత్య నిర్వహణ‘ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచీ వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తమ వ్యవసాయానికి ఏ కార్తెలో వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి? వంటివన్నీ అడిగి తెలుసుకుంటారు. మనకు తెలుగు సంవత్సరాలు ‘ప్రభవ‘తో మొదలుపెట్టి ‘అక్షయ‘నామ సంవత్సరము వరకు గల 60సంవత్సరములలో మానవులు తాము జన్మించిన నామ సంవత్సరాన్ని వారి జన్మాంతర సుకృతాలనుబట్టి జీవితంలో ఒక్కసారో, రెండుసార్లో చుస్తూంటారు! అందువల్లనే వారు జన్మించిన 60 సంవత్సరములకు తిరిగి ఆ నామ సంవత్సరం వచ్చినపుడు, అది ఒక పర్వదినంగా భావించి ‘షష్టిపూర్తి‘ ఉత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ ఉంటారు.
పంచాంగ శ్రవణం:
ఈ రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం జరుగుతుంది. సాధారణంగా సాయంత్ర సమయాన ఊరి జనాలు ఒక చోట చేరి, సిద్ధాంతి చెప్పే పంచాంగ వివరాలు, ఆ సంవత్సరరాశి ఫలాలు తెలుసుకుంటారు సిద్ధాంతి దేశ, రాష్ట్ర, వ్యక్తీ స్థితి గతులు ఎలా ఉంటాయో వివరణ చేస్తాడు. పంచాంగ శ్రవణం వాళ్ళ రానున్న మంచి చెడులను సమభావంతో స్వీకరించ గలరని, పంచాంగ శ్రవణం వినడం మంచిది అని మన పెద్దలు చెప్పటం జరిగింది.
కవి సమ్మేళనం:
ఉగాదికి సాహితీవేత్తలు ప్రత్యేకంగా "కవి సమ్మేళనం" నిర్వహిస్తారు. కొత్త, పాత కవులు నవభావన, పాత ఓరవళ్ళు కలిపి కొత్త పద్యాలు, కవితలు తయారు చేసి చదువుతారు. సామాజిక జీవనం, రాజకీయం, వాణిజ్యం ఇలా అన్నివిషయాలను గూర్చి ప్రస్తావిస్తారు, కవులు తమకవితలలో. ఈ విధంగా నానా రుచి సమ్మేళనంగా జరుగుతుంది ఉగాది కవి సమ్మేళనం.
ఊరగాయల కాలం:
మామిడికాయలు దండిగా రావడంతో స్త్రీలు ఊరగాయలు పెట్టడం మొదలెడతారు. వర్షాకాలం, చలికాలానికి ఉపయోగించు కోవడానికి వీలుగా మామిళ్ళను, ఇతర కాయలను ఎండబెట్టి, ఊరవేస్తారు. తెలుగు వారిళ్ళలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది "ఆవకాయ". “ఇలా వివిధ విశేషాలకు నాంది యుగాది - తెలుగువారి ఉగాది”
- బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వరంగల్ అర్బన్ శాఖ